బాబా రాందేవ్‌పై ఎఫ్‌ఐఆర్

27 Apr, 2014 04:01 IST|Sakshi
బాబా రాందేవ్‌పై ఎఫ్‌ఐఆర్

రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానం  ఆయన వ్యాఖ్యలను ఖండించిన పలు పార్టీలు
 
 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి యోగాగురువు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన తర్వాత ఐపీసీ సెక్షన్ 171 (జి) (ఎన్నికలతో సంబంధం ఉన్న తప్పుడు ప్రకటన) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏఎస్‌పీ హబీబుల్ హసన్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. హనీమూన్, విహార యాత్రల కోసం రాహుల్ గాంధీ దళితుల ఇంటికి వెళుతున్నారని రాందేవ్ బాబా శుక్రవారం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ వ్యాఖ్యలపై దుమారం రేగింది. పలు పార్టీలు ఆయన వ్యాఖ్యల్ని ఖండించాయి. తన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
బహిరంగ క్షమాపణ చెప్పాలి..


 రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన దళితులను అవమానించారని, అందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలపై నరేంద్ర మోడీ, బీజేపీ స్పందించాలన్నారు. అవి తుచ్ఛమైనవని, సిగ్గుపడే వ్యాఖ్యలని కేంద్ర మంత్రి చిదంబరం ధ్వజమెత్తారు. రాందేవ్ వ్యాఖ్యలపై మోడీ మౌనం దాల్చుతున్నారంటే ఆయన వాటిని సమర్థిస్తున్నట్లేనని ఆలిండియా మహిళా కాంగ్రెస్ చైర్మన్ శోభా ఓఝా అన్నారు. యోగా గురువుపై ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద విచారణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని ఆ పార్టీ నేత బృందాకారత్ ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఎస్‌పీ నేతలు పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
 
కించపరిచే ఉద్దేశం లేదు..: అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో రాందేవ్ బాబా విచారం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీనో, దళితుల్నో కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. తన మాటలు దళితుల్ని బాధపెట్టి ఉంటే దానికి విచార పడుతున్నానని వడోదరలో చెప్పారు. హనీమూన్ అనే పదం రాజకీయాల్లో వాడుతుంటారని, అదే ఉద్దేశంతో తాను ఉపయోగించానన్నారు. అయితే రాహుల్ ప్రచారం కోసమే దళితుల గృహాల్ని సందర్శిస్తారనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. కాగా, రాందేవ్‌ను బీజేపీ వెనకేసుకొచ్చింది. ఆయన హనీమూన్ అనే పదాన్ని ఏభావంలో వాడారో ఆ భావంతోనే తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ దృష్టి కోణంలో కాదని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు