అది ప్రజా తీర్పుకాదు...

18 May, 2014 02:49 IST|Sakshi
అది ప్రజా తీర్పుకాదు...

చీరాల, న్యూస్‌లైన్:  చీరాల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ తరుఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపు ప్రజాతీర్పు కాదని టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావు ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ నాటి నుంచి చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ పీడీ పద్మజ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి రౌండు ఫలితం వెల్లడించాల్సి ఉండగా ఎనిమిది రౌండ్ల వరకు మాత్రమే ప్రకటించారన్నారు. ముందు ఒక మెజార్టీని ప్రకటించి కొంత సమయం తరువాత 11వేల మెజార్టీ ఆటో గుర్తు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు వచ్చినట్లుగా చెప్పడం  ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
 
అలానే పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు తాళాలు లేకుండా తెచ్చారని ఆరోపించారు. అందులో 200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆటో గుర్తుకే వచ్చాయని, ఇది ఎలా సాధ్యపడిందన్నారు. ఇదే విషయాన్ని ఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 60 ఈవీఎంలు తారుమారు అయ్యాయని, ఇవి టీడీపీకి పట్టున్న పాపాయిపాలెం, దేవాంగపురి, ఈపూరుపాలెం గ్రామాలవని అన్నారు. అందులో టీడీపీకి అతి తక్కువ ఓట్లు రావడం అనుమానాలకు తావిస్తుందన్నా రు. ఈవీఎంలకు ఉండాల్సిన నంబర్లు, చీటీల నంబర్లు, ఎన్నిక జరిగిన రోజు ఉన్న నంబర్లుకు తేడా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ఆర్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టి రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 ఉద్రిక్త పరిస్థితులు
 చీరాల అర్బన్, న్యూస్‌లైన్: చీరాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు గడియారం స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. చీరాల అసెంబ్లీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కార్యకర్తలు బాహాటంగా విమర్శలకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో వెంటనే ఒన్ టౌన్, టూ టౌన్ సీఐలు రంగప్రవేశం చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకూడదంటూ పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం టీడీపీ వర్గీయులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు