ఆట నుంచి ఓటు దాకా...

28 Mar, 2014 11:53 IST|Sakshi
ఆట నుంచి ఓటు దాకా...

బ్యాట్ పట్టినవారు, బాక్సింగ్ చేసిన వారు, ఈత కొట్టిన వారు, షూటింగ్ చేసిన వారు.... ఇలా ఆటగాళ్లెందరో ఓటు వేటగాళ్లుగా మారారు. ఆట మైదానంలో చూపిన నేర్పునే ఓటు మైదానంలోనూ చూపిస్తామంటూ ముందుకొచ్చారు. సినీ స్టార్ల తరువాత అంతటి క్రేజున్న ఆటగాళ్లు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు.

ఫుట్ బాల్ కింగ్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున గోల్ కొడతానంటున్నారు. చిరునవ్వుల క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ తరఫున ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక షూటర్ రాజ్యవర్ధన్ రాథోర్ బిజెపి తరఫున గురి తప్పనంటున్నారు.

ఇప్పటి వరకూ స్టేడియం నుంచి చట్టసభకు పోటీపడ్డ ఆటగాళ్లెవరో చూద్దాం.

మన్సూర్ అలీఖాన్ పటౌడీ - మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రంగంలోకి దిగిన ఈ స్టైలిష్ నవాబు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. అంతకు ముందు ఆయన 1971 లో హర్యానా నుంచి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. దేశానికి క్రికెట్ పిచ్చి అంటని రోజుల్లో ఆయన పోరాడి ఓడారు.

చేతన్ చౌహాన్ - ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన ఓపెనర్లలో ఒకరుగా పేరొందిన చేతన్ రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బిజెపి నేతగా నిలిచారు.ఆయన అమ్రోహా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.

అస్లాం షేర్ ఖాన్ - ఈ హాకీ షేర్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి, మన హాకీ టీమ్ పరిస్థితి ఒకటేలా ఉంది.

జ్యోతిర్మయ్ సిక్దర్ - ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ సీపీఎం తరఫున కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్) నుంచి 2004 లో గెలిచింది. 2009 లో మాత్రం ఆమెకన్నా గజ ఈతగత్తె అయిన మమతా బెనర్జీ వేగానికి తలవంచక తప్పలేదు.

జస్పాల్ రాణా - ఈ ఏస్ షూటర్ 2009 లో తెహ్రీ గఢ్ వాల్ (ఉత్తరాఖండ్) నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. కానీ గురి తప్పింది. ఆ తరువాత 2012 లో ఆయన బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ సారి అంచనా తప్పింది.

కీర్తి ఆజాద్ - బ్యాట్ తోనూ, నోటి తోనూ సమానంగా ఆడగల కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. తండ్రి సహా కాంగ్రెస్ నుంచి బిజెపి టీమ్ లో చేరాడు. దర్భంగా ఎంపీ అయ్యాడు. ఈ సారి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడతానంటున్నాడు.

నవజ్యోత్ సింగ్ సిద్ధు - అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న సిద్ధు రెండుసార్లు అమృతసర్ ఎంపీగా గెలిచారు. మోడీ వీరాభిమాని అయినా 2014 బిజెపీ టీమ్ లో ఈయనకు చోటు దక్కలేదు.

మహ్మద్ అజారుద్దీన్ - క్రికెట్ లో ఈయన బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎంపీగా నోరు మాట్లాడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అయిదేళ్లలో రెండే రెండు సార్లు నోరు విప్పి మాట్లాడారు. అయిదంటే అయిదు ప్రశ్నలు వేశారు. ఈ సారి రాజస్తాన్ నుంచి లక్ ట్రై చేసుకుంటున్నారు.

మనోహర్ ఐచ్ - నాలుగున్నర అడుగుల ఐచ్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్. ఎనభై ఏళ్లు వచ్చినా కండల వీరుడిగానే నిలిచాడు. ఈయన బిజెపి తరఫున బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్యే ఐచ్ చనిపోయారు.

మరిన్ని వార్తలు