స్థానిక కౌంటింగ్ కేంద్రాల్లో మార్పులు

11 May, 2014 03:41 IST|Sakshi

- మొత్తం ఆరు చోట్ల లెక్కింపు
- ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం

 
 చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఏప్రిల్‌లో నిర్వహించిన 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ఈనెల 13వ తేదీ ప్రకటించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే మదనపల్లెలోని వశిష్ట కళాశాలలో స్థలం చాలకపోవడంతో పక్కనే ఉన్న కేశవరెడ్డి పాఠశాలను సైతం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి, రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి తదితరులు కేశవరెడ్డి పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.

కౌంటింగ్ కేంద్రాలు
జిల్లాలో మొత్తం ఆరుచోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 65 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివాదాలు ఏర్పడితే రీకౌంటింగ్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏ సమయానికి పూర్తవుతుందనే విషయంపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక డివిజన్లు, మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలిస్తే..

 చిత్తూరు..
చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్‌ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు.

పలమనేరు..
రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు.

మదనపల్లె..
మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఇక మదనపల్లె పట్టణంలోని వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు.

తిరుపతి..
తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే తిరుపతి నగరంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.

మరిన్ని వార్తలు