ప్యాకేజీలతో నాయకులకు వల

18 Apr, 2014 03:05 IST|Sakshi
ప్యాకేజీలతో నాయకులకు వల

ఉలవపాడు, న్యూస్‌లైన్ : నాయకులంటే కార్యకర్తలకు అండగా ఉండాలి. వారి సమస్యలు పరిష్కరిస్తూ నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. కానీ, ప్రస్తుత నేతలు తమ వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారు. ఉలవపాడు మండలంలోని ఇలాంటి నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా ఆ పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కోసం టీడీపీ నేతలు వేట ప్రారంభించారు. టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గంగా మారి ఆ పార్టీలో చేరాలని, అలాచేస్తే ప్యాకేజీలు ఇప్పిస్తామని కొందరు టీడీపీ నాయకులు.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పటి వరకు స్థానికంగా టీడీపీ నేత దివి శివరాంకు వ్యతిరేకంగా పనిచేసినందున.. ఆయనతో సంబంధం లేకుండా నేరుగా కావలి వెళ్లి ఆదాల ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్యాకేజీల కోసం కావలి, కందుకూరు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి వారికి వద్ద ఉన్న కార్యకర్తలకు ఏమీ అర్థం కావడం లేదు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం నాయకులు ఎగబడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఏ పార్టీలోకీ రామని తెగేసి చెబుతున్నారు. కానీ, కందుకూరు నియోజకవర్గంలో మంచి ఊపుమీదున్న వైఎస్‌ఆర్ సీపీని తట్టుకోవాలంటే తటస్థంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు వల వెయ్యాలని టీడీపీ నాయకులు నానాకష్టాలు పడుతున్నారు.

గతంలో ఎప్పుడూ ప్యాకేజీలు ఇవ్వని శివరాం కూడా ఇప్పుడు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు ఇప్పటికే వైఎస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటూకాకుండా పోయిన దాదాపు 20 మంది కాంగ్రెస్ నాయకులను ఆదాల అనుచరులు కలిసి ప్యాకేజీలు ప్రకటించారు.

 ఈ ప్యాకేజీలకు కొందరు సుముఖత వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అధిక మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. 100 ఓట్లున్న ఓ నాయకునికి 50 వేల రూపాయలు ఆఫర్ చేయగా.. ఆ నాయకుడు లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

 ఈ విషయాన్ని గమనించిన కార్యకర్తలు, ప్రజలు తమ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు పుచ్చుకుంటున్న వారివెంట వెళ్లేది లేదని వారంతా స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ప్యాకేజీలు మాట్లాడుకున్న కొందరు నేతలు.. తమ వెనుక ఎవరూ రాకపోతుండటంతో తలలు పట్టుకుని కూర్చున్నారు.

మరిన్ని వార్తలు