వైఎస్సార్ సీపీకే ప్రజాదరణ

27 Apr, 2014 01:35 IST|Sakshi
వైఎస్సార్ సీపీకే ప్రజాదరణ

పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి

మేడ్చల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీని ప్రజలు విశేషంగాఆదరిస్తున్నారని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మండల వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో  నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ పరిధిలో ఎక్కడకు వెళ్లినా అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్‌లలో మురికి వాడలు లేకుండా చేస్తానన్నారు.

తాగునీటి వసతి, మెరుగైన రోడ్లు తదితర వసతులు కలిపిస్తానని పేర్కొన్నారు. కాగా.. మండలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ జోరుగా సాగింది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, మార్కెట్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డు, బస్‌డిపో, ముకుంద్ థియేటర్, కిష్టాపూర్, పూడూర్ గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బి.వి. ప్రకాష్ వంజరి, నాయకులు శ్రీధర్‌గౌడ్, మహబూబ్‌అలీ, అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.

 సంక్షేమ పథకాల ఘనత వైఎస్‌దే  
 కీసర: మహానేత వైస్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయారని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. కీసరలో శనివారం నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఆయన మాట్లాడారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. వైఎస్ పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.  వైఎస్ ఆశయ సాధనకోసమే జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు.

ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే వైఎస్సార్ సీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని, తనను గెలిపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ దర్గాసుఖేందర్‌రెడ్డి, కీసర ఇన్‌చార్జి ముజిబ్, నేతలు  డా.నరహరి, ప్రవీణ్, నారాయణ, రమేష్ , కుంటోళ్ల సత్యనారాయణ, రత్నం, మంగమ్మ, ప్రకాష్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, ముఖేష్‌రాజ్, అంజి, రాజు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

 రాజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం  
 ఘట్‌కేసర్ టౌన్: రైజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఘట్‌కేసర్ పట్టణంలో శనివారం రాత్రి  రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్‌శాఖను ప్రక్షాళన చేశానని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించానన్నారు.

పేదల పక్షపాతి వైఎస్సార్‌ను బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. సూర్య, చంద్రాదులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సుస్థిర పాలన, రామ రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తూకుంట కృష్ణారెడ్డి, సామల యాదిరెడ్డి, పెరమాండ్ల అశోక్, శ్యామ్‌రావ్, రాజు, గణేష్, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు