కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి

27 Apr, 2014 01:44 IST|Sakshi
కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి

చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

షాబాద్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగరగూడ, షాబాద్, కక్కులూర్, హైతాబాద్, మద్దూర్ తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న హోంమంత్రి స్థానంలో ఉండి కూడా సబితారెడ్డి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తన కుమారుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడంటూ ప్రజల వద్దకు ఆమె వస్తున్నారని ఎద్దేవ చేశారు.

బీజేపీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు వేసినట్లేనని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే 111జీఓను ఎత్తివేస్తామని, ఫిరంగి నాలాను పునరుద్ధరించి ఇబ్రహీంపట్నం వరకు తాగు, సాగు నీరు అందజేస్తామని చెప్పారు. జూరాల నుంచి జిల్లాకు నీటిని తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కడ్మూర్ ఆనందం, మద్దూర్ మల్లేశ్, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, ఈదుల నర్సింలుగౌడ్, మహేందర్‌గౌడ్, వెంకటయ్య, జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి,  శ్రీరాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దర్శన్, గోపాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, కుమ్మరి దర్శన్, మల్లిఖార్జున్ తదితరులున్నారు.

 నాగరగూడలో పోటాపోటీ ప్రచారం
 మండల పరిధిలోని నాగరగూడలో శనివారం ఉదయం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఇండిపెండెంట్ అభ్యర్థి దేశమళ్ల ఆంజనేయులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా అక్కడికి చేరుకున్న విశ్వేశ్వర్‌రెడ్డి ప్రచారం సాగిస్తుండగానే ఆంజనేయులు కూడా వచ్చి ప్రచారం చేశారు.

మరిన్ని వార్తలు