సారీ.... అన్నా..!

12 Apr, 2014 03:20 IST|Sakshi
సారీ.... అన్నా..!

ఉపసంహరణకు ముందుకు రాని అభ్యర్థులు
పార్టీ నేతలతో మొదలైన టెన్షన్
పనిచేయని ఆఫర్లు, ప్యాకేజీలు
నేడు మధ్యాహ్నం 3గంటల వరకే గడువు

 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులకు ప్రధాన పార్టీల నేతలు జరిపిన మంతనాలకు వారెవ్వరు ఒప్పుకోకపోగా, సారీ అంటూ చేతల్లో చూపించారు. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైనా శుక్రవారం ఏఒక్క అభ్యర్థి అయినా ఉపసంహరించుకొనేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీల నేతల గుండెల్లో బరిలో ఉన్నా స్వతంత్ర అభ్యర్థులు రైళ్లు పరుగెత్తిస్తున్నారు.

 నామినేషన్లు దాఖలు చేసినప్పటినుంచి వారితో రెగ్యులర్‌గా మంతనాల్ని జరుపుతున్నా, తొలి రోజు ఉపయోగం లేకపోయింది. ఇక కొంత మంది స్వతంత్ర అభ్యర్థులకైతే అడిగినంతా ఇస్తాం, లేదంటే మంచి ప్యాకేజీలను ఇస్తామని ప్రకటించినా, బరిలో ఉన్న వారు అసక్తి కనపర్చడంలేదని తెలుస్తోంది. వీరికి ఇంకేం చేస్తే ఉపసంహరించుకుంటారని ప్రధాన పార్టీల నేతలు సమాలోచనలో పడ్డారు.  

 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో:
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో 16మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఏఒక్కరు ఉపసంహరించుకోలేదు. ఇక నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 8మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవ్వరు ముందుకు రాకపోవడంతో వీరంతా బరిలో ఉంటారనే తెలుస్తోంది. ఇక రాత్రి రాత్రి చర్చల్లో ఎంత మందికి ముందుకు వస్తారానేది వేచి చూడాలి.
 అసెంబ్లీ బరిలో...

14అసెంబ్లీ నియోజకవర్గాల్లో 213మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అచ్చంపేట్‌లో గువ్వల అమల, నారాయణపేట్ విఠల్ రావు ఆర్యాలు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు.  అధికారికంగా అమోదించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక అన్నింటికంటే ఎక్కువగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనే 24మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారే గెలుస్తామనే ధీమాలో ఉండడంతో, ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.

 వీరిచే ఉపసంహరించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేయని ప్రయత్నమంటూ ఏమీ లేదు, అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఓనేత ఏకంగా స్వతంత్ర అభ్యర్థిని బెదిరించడంతో, అతను గడువు ముగిసేంత వరకు అండర్ గ్రౌండ్‌ల్లోకి వెళ్లినట్లు సమాచారం.

 నేటితో ముగింపు...ఉపసంహరణకు విధించిన గడువు నేడు మధ్యాహ్నం 3గంటలతో ముగియనుంది. ఇందుకుగాను స్వతంత్ర అభ్యర్థులచే ఉపసంహరింపజేసేందుకు ప్రధాన పార్టీలైతే ఏకంగా రాష్ట్ర నేతల్ని రంగంలోకి దింపారు. వీరి ప్రయత్నాలు, ప్యాకేజీలు, ఆఫర్లు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు