కసరత్తు

13 Apr, 2014 03:50 IST|Sakshi
కసరత్తు


 సాక్షి; కడప:ఎన్నికలపోరులో సెమీఫైనల్స్ ముగిశాయి. మునిసిపల్, పరిషత్ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని రాజకీయపార్టీలు ఫైనల్స్‌పై దృష్టి సారించాయి. మే 7న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రానున్న 20 రోజులు అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి. నామినేషన్ల పర్వం ముగించుకుని ప్రచారపర్వాన్ని వేగవంతం చేయనున్నాయి.

ఈ ప్రక్రియలో అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కదనోత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఈ నెల 17, 18న వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్కరోజు చొప్పున ప్రచారం నిర్వహించే ందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 సంక్షేమపాలనే లక్ష్యంగా...ప్రచారం:
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయపరిణామాలతో పాటు తర్వాతి ప్రభుత్వాలు సంక్షేమపథకాలను తుంగలోకి తొక్కిన వైనం, ప్రజల అవస్థలు తదితర అంశాలపై వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు వివరించనుంది.

 వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకొస్తే తిరిగి ‘స్వర్ణయుగాన్ని’ తీసుకొస్తామనే లక్ష్యంతో జగన్ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలుఇచ్చి...ప్రజలను మోసం చేయడం తనకు చేతకాదని...కేవలం చేసేపనులనే చెబుతానని ప్రచారం సాగిస్తూ ప్రజల్లో విశ్వసనీయతను పాదుగొల్పుతున్నారు.

అమ్మఒడి, పగటిపూట 7గంటల  ఉచితవిద్యుత్, ఐకేపీ రుణాల మాఫీ, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల పెంపు, రేషన్‌బియ్యం కోటా పెంపు తదితర ప్రజాయోగ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజలు కూడా ‘వైఎస్ కుటుంబం చేసేపనులనే చెబుతుంది....చెప్పిన తర్వాత ఎంత కష్టమైనా చేసి చూపిస్తుంది’ అని నమ్ముతున్నారు.

వీటితో పాటు రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని రాష్ట్రవిభజనను ఆపేందుకు చివరి క్షణం వరకూ వైఎస్సార్‌సీపీ పోరాడిన వైనం, టీడీపీ విభజనవాదాన్ని ప్రజలకు వివరించనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సొంతజిల్లా కావడం, సింహభాగం ప్రజలు ‘ఫ్యాన్’గాలిని కోరుకుంటుండటంతో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


 కాంగ్రెస్...జేఎస్పీ నేతలు సైతం జిల్లాకు:
 జిల్లాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉన్నా కాంగ్రెస్, జై సమైక్యాంధ్రపార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్  రఘువీరారెడ్డి, చిరంజీవి ప్రచారానికి రానున్నారు. ఈ నెల 24న వీరి పర్యటన ఉండే అవకాశం ఉంది. అభ్యర్థుల దొరక్క తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్‌పార్టీ ప్రచారంపై పెద్దగా దృష్టిసారించలేదు.

 ఎలాగూ తమకు విజయావకాశాలు లేవనే కారణంతోనే నిర్లిప్తంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా జిల్లాలో ప్రచారానికి రానున్నారు. ఈ పార్టీకి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి. దశ-దిశ లేకుండా సాగుతున్న ఈ పార్టీపై కూడా ప్రజలకు ఏ మాత్రం ఆశల్లేవు. అయితే దొరికిన వారిని బరిలో నింపి 20వ తేదీ తర్వాత వారికి మద్దతుగా ప్రచారం చేసేందుకు కిరణ్ జిల్లాకు రానున్నారు.

రాష్ట్రవిభజనకు కారణమైన కాంగ్రెస్, విభజనను ఆపడంలో పూర్తిగా విఫలమైన కిరణ్‌పై కూడా జిల్లావాసులు మండిపడుతున్నారు. జిల్లాలో రాజంపేట పార్లమెంట్‌తో పాటు కడప, రాజంపేట అసెంబ్లీస్థానాల్లో బరిలో నిలిచే అవకాశం ఉన్న బీజేపీ తరఫున వెంకయ్య కూడా ప్రచారానికి రానున్నారు. దీంతో ప్రధానపార్టీలన్నీ ‘ఫైనల్’పోరులో గెలిచేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ‘ఫ్యాన్’గాలికి ఎదురెళ్లడం ఆషామాషీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
  బాలకృష్ణను జిల్లాకు రప్పించే యత్నం

 ‘రాళ్లుకొట్టుకోవాలని రాసుంటే...రాజెలాఅవుతారు’ అన్నచందంగా తయారైంది టీడీపీ నేతల పరిస్థితి. పదేళ్లుగా జిల్లాలో ఏ ఎన్నికలకు వెళ్లినా ఘోరపరాజయాలు చవిచూస్తున్నారు. పైగా జగన్‌గాలి జోరుగా వీస్తున్న ఈ ఎన్నికల బరిలో నిలవడం టీడీపీ అభ్యర్థులకు సవాల్‌గా మారింది. కేవలం ‘డబ్బు’ మంత్రాన్ని నమ్ముకుని ఎన్నికల బరిలో దిగుతున్న వీరు కనీసం రెండుస్థానాలైనా దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

అయితే  2004కు ముందు టీడీపీ పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. డ్వాక్రా రుణాలతో పాటు రైతుల వ్యవసాయరుణాలు మాఫీ చేస్తామనే ప్రచారంతో ప్రజల్లోకి టీడీపీ వస్తోంది. అయితే రాష్ట్రబడ్జెట్ ఆ స్థాయిలో లేనప్పుడు రుణాలు ఎలా మాఫీ చేస్తారని, ఇలాంటి మాటలతో ప్రజలను మోసం చేయడమే అని రైతులు మండిపడుతున్నారు.

జిల్లాకో ఉద్యోగం ప్రకటనపై కూడా పెదవివిరుస్తున్నారు. ఆచరణసాధ్యం కాని హామీలతో ప్రచారానికి వెళ్తే అసలుకే మోసం వస్తుందేమోనని తమ్ముళ్లూ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రచారానికి బాబు కంటే బాలకృష్ణను రప్పిస్తేనే బాగుంటుందని తమ్ముళ్లు భావిస్తున్నారు.  

 తెలిసీతెలియని రాజకీయంతో ఏంమాట్లాడుతాడో బాలయ్యకు తెలీదని, బాలయ్య కంటే బాబే మేలని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి కంటే లోకేశ్‌ను రప్పిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ‘ఫైనల్’ ప్రచారానికి బాలయ్యే ఫైనల్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు