రేపటి నుంచి సార్వత్రిక నామినేషన్లు

11 Apr, 2014 03:57 IST|Sakshi

 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి శశిధర్ తెలిపారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా పూరించి దాఖలు చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవనంలో రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప లోక్‌సభ స్థానానికి కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టరేట్‌లోనే నామినేషన్లు వేయాలన్నారు.


ఒకవేళ ఆర్వో అందుబాటులో లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన డీఆర్వో వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్కడి ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. రాజంపేట లోక్‌సభకు నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు చిత్తూరుకు వెళ్లి ఆర్వో అయిన అక్కడి జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.


ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలైన  13, 14, 18 తేదీలలో నామినేషన్లు స్వీకరించబోరని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీన స్క్రూటినీ, 23న ఉపసంహరణ ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు లేని రాజకీయ పార్టీ అభ్యర్థికి  పదిమంది బలపరచాల్సి ఉంటందని పేర్కొన్నారు. ఆర్వో గదిలోకి అభ్యర్థితోసహా ఐదు మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్వో గదికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఒక్కో వాహనంలో ఐదు మందికి మించకూడదన్నారు.


 నామినేషన్లు ముగిసే వరకు కలెక్టరేట్‌లోకి ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను మాత్రమే దాఖలుచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు అర్హత ఉంటుందని చెప్పారు. లోక్‌సభకు నామినేషన్ ఫీజు కింద రూ. 25 వేలు, అసెంబ్లీకి రూ. 10 వేలు చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం మినహాయిం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్బంగా సమర్పించే ఫారం-26 (అఫిడవిట్‌లో) ఖాళీలు వదలరాదన్నారు.


తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజమని రుజువైతే చర్యలు తప్పవన్నారు. అఫిడవిట్లను ఆర్వో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటిస్తామని సీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, మీడియాకు ఉచితంగా అందజేస్తామని వివరించారు. అఫిడవిట్లలో ఖాళీలు వదిలితే అభ్యర్థికి నోటీసు జారీ చేస్తామని, ఆ అభ్యర్థి మళ్లీ నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసేందుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంకు అకౌంటును తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు.


దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఓటున్న నియోజకవర్గం నుంచి సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా పొందుపరచాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద 50 వేల రూపాయల కంటేఎక్కువ ఉంటే సీజ్ చేస్తామన్నారు. ముగ్గురు వ్యయ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నారని, వ్యయ నివేదికలను అభ్యర్థులు సక్రమంగా సమర్పించాలన్నారు. ప్రతి అభ్యర్థికి తాము షాడో రిజిష్టర్‌లను నిర్వహిస్తామన్నారు.


 ఓటరు స్లిప్పులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజున ఓటరు కుడి చూపుడు వేలుకు ఇంకు గుర్తు వేస్తారని తెలిపారు. స్లిప్పులు లేకపోయినా ఈసీ సూచించిన 24 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టినా ఓటు వేయడానికి అనుమతిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 560 ర్యాంప్స్, టాయిలెట్స్, తాగునీరు, షామియానా వంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల వలే డిక్లరేషన్ సరిపోదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఒకరు మాత్రమే జనరల్ ఏజెంటుగా ఉంటారని, ప్రభుత్వ గన్‌మెన్ సౌకర్యం ఉన్న వారిని జనరల్ ఏజెంటుగా అనుమతించబోమన్నారు.

మరిన్ని వార్తలు