నేను పోటీ చేయను

14 Apr, 2014 02:59 IST|Sakshi
నేను పోటీ చేయను

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహార తీరుపై కలత చెందిన మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జరగబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు నెల్లూరు రూరల్ టికెట్ కావాలని ముందే అడిగినా బీజేపీకి కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ సారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటానని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారని తెలిసింది.

ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని ఆరు నెలలుగా సోమిరెడ్డి ఆశపడుతూ వచ్చా రు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూనే చంద్రబాబుకు తన కోరికను విన్నవించారు. కోవూరు టికెట్ తన మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై సోమిరెడ్డి తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ వివాదాన్ని  పరిష్కరించే క్రమంలో భాగంగా చంద్రబాబు సోమిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్  ఇవ్వడానికి సరేనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 ఇటీవల నెల్లూరులో జరిగిన ప్రజాగర్జన సభకు జన సమీకరణ అంశాలపై చర్చించడానికి జిల్లాకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డే పోటీ చేస్తాడని పార్టీ నేతలకు బహిరంగంగానే చెప్పారు. దీంతో  సోమిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో పర్యటనలు చేయడంతో పాటు పార్టీ కేడర్స్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సారి తాను నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని, సర్వేపల్లి నుంచి కొత్త వ్యక్తికి ఎవరికైనా అవకాశం వస్తుందని సోమిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేశారు.

అయితే టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తుల చర్చల్లో  నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం గురించి జిల్లా పార్టీ నాయకులతో గాని, టికెట్ ఆశిస్తున్న సోమిరెడ్డితో గాని చంద్రబాబు మాట మాత్రం గా కూడా చర్చించలేదు. మీడియా ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి అప్పటికప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు, ఎంపీ సుజనా చౌదరితో ఫోన్‌లో మాట్లాడి తన నిరసనను తెలియజేశారు. రూరల్‌కు బదులు సర్వేపల్లి, లేదా గూడూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని సూచించారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో చంద్రబాబును కలుసుకుని ఈ ప్రతిపాదన గురించి మరోసారి ఒత్తిడి తెచ్చారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వంతో మాట్లాడి సీటు సర్దుబాటు చేయాలని కోరారు. తాను బీజేపీ నాయకులతో మాట్లాడుతానని సోమిరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చా రు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే రోజుకు (12వ తేదీకి)  ఈ సమస్య సర్దుబాటు అవుతుందని సోమిరెడ్డి భావించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలు విడుదలైనా సోమిరెడ్డి గోడు చంద్రబాబు పట్టించుకోలేదని తెలిసింది.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సోమిరెడ్డి ఈసారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని పార్టీ అభ్యర్థుల విజయం కోసం జిల్లా అంతటా ప్రచారం చేస్తానని పరోక్షంగా చంద్రబాబుకు తన నిరసన తెలియచేశారు. సర్వేపల్లి నుంచి తన పేరు ప్రకటించినా తాను నామినేషన్ వేసేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో శని, ఆదివారాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను అనేక రకాలుగా బుజ్జగించారు.

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే పార్టీకి మంచిది కాదని ఈ అసంతృప్తి పార్టీ కేడర్ మీద కూడా పడుతుందని ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడుతున్నా, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నా చంద్రబాబు తనను పట్టించుకోలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.

ఈ వివాదాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సోమవారం చంద్రబాబుతో మరోసారి సమా వేశమై సీటు బీజేపీ అంగీకరించకపో యినా నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డిని స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో దించాలని జిల్లా నాయకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు