నల్లగొండపై... నజర్

25 Apr, 2014 00:44 IST|Sakshi
నల్లగొండపై... నజర్

సాక్షిప్రతినిధి, నల్లగొండ, మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా, 28వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలూ వీటిని కీలకంగా భావిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్, బీజేపీ, తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్, ఇలా..  

ఈ మూడు పార్టీలూ తెలంగాణ సెంటిమెంటు ఓటుపై ఆశలు పెట్టుకున్నాయి. వీటితో పాటు జాతీయస్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు సహకరిం చిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ) తెలంగాణ శాఖ సైతం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. కాగా, ఇపుడు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం ముఖ్య నాయకులు ప్రచారానికి జిల్లాపై ముప్పేట దాడి చేయనున్నారు.

ప్రధాని మన్మోహన్‌సింగ్ కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటున్నారు. ఈ సభ శని వారం జరగనుంది. దీంతో కాంగ్రెస్ నాయకులతో పాటు, అధికార యంత్రాంగం సైతం ప్ర ధాని సభ ఏర్పాట్లలో మునిగిపోయాయి.

లోక్‌సభలో బీజేపీ నేత సష్మాస్వరాజ్ కూడా ఇదే రోజు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరి ధిలో పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా, భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఆలే రు, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్‌రెడ్డి, చెరుకు లక్ష్మి బరిలో ఉన్నారు.

మునుగోడులో బీజేపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ మనోహర్‌రెడ్డి పోటీలో ఉండడంతో సుష్మాస్వరాజ్ బహిరంగ సభను చౌటుప్పల్‌లో ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున 25వ తేదీన జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ లో పర్యటించాల్సిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఒకరోజు వాయిదా పడింది. 26వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది.

తొలిసారి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్‌ఎల్డీ) నుంచి ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ భువనగరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ 25వ తేదీన మునుగోడులో ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఆ మరుసటి రోజు ఆలేరులో అజిత్‌సింగ్‌తో పాటు సినీ నటి జయప్రద, అమర్‌సింగ్‌లు కూడా టీఆర్‌ఎల్డీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా పర్యటించనున్నా రు. మొత్తంగా అన్ని పార్టీల ముఖ్య నే తలు రెం డు మూడు రోజుల్లో జిల్లా ప్రచారానికి వస్తుండడంతో ఆ పార్టీల కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.

మరిన్ని వార్తలు