‘ఫ్యాను’ గుర్తుపై ఆర్‌ఓలకు సమాచారమివ్వండి

4 Apr, 2014 03:03 IST|Sakshi

సీఈఓకు వైఎస్సార్‌సీపీ వినతి
 సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులకు ‘సీలింగ్ ఫ్యాను’ ను ఉమ్మడి చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం  కేటాయించిన విషయాన్ని రాష్ట్రంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు పీఎన్వీ ప్రసాద్, కె.శివకుమార్ గురువారం ఒక వినతిపత్రం సమర్పించారు. తమపార్టీకి ‘సీలింగ్ ఫ్యాను’ గుర్తు కేటాయించాలని ఎలాంటి వర్తమానం రాలేదని పలువురు రిటర్నింగ్ అధికారులు తమకు తెలియజేశారని వారు సీఈఓ దృష్టికి తెచ్చారు. అందువల్ల తక్షణమే ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలివ్వాలని వారు కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ‘సీలింగ్ ఫ్యాను’ చిహ్నాన్ని కేటాయిస్తూ రాసిన లేఖ ప్రతిని కూడా వారు వినతిపత్రంతో జతపరిచారు. భన్వర్‌లాల్ సమయానికి కార్యాలయంలో లేనందువల్ల వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన వినతిపత్రాన్ని అదనపు సీఈఓ వెంకటేశ్వరరావు తీసుకుని ఆ ప్రకారం సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. ‘సీలింగ్ ఫ్యాను’ కేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఆయన అధికారులకు చెప్పినట్టు పీఎన్వీ ప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు