‘మహా’వీరులెవ్వరో..!

26 Apr, 2014 23:06 IST|Sakshi
‘మహా’వీరులెవ్వరో..!

- ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేస్తున్న ప్రధాన పార్టీలు
- డీఎఫ్‌కు గడ్డుకాలమే అంటున్న సర్వేలు
- ఎమ్మెన్నెస్ దెబ్బ కొడుతుందన్న ఆందోళనలో మహాకూటమి
- అంచనాలకు అందని ఆప్ ప్రభావం

 
 సాక్షి, ముంబై: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. మూడు దశల్లో 48 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 900 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైంది. ఓటరు ఎవరివైపు మొగ్గుచూపారన్న దానిపైనా అన్ని పార్టీ నేతల్లో ఆందోళన ఉన్నా, పైకి మాత్రం గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే మే 16వ తేదీన ‘మహా’ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఈసారి ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17, మిత్రపక్షమైన ఎన్సీపీ ఎనిమిది స్థానాలు, శివసేన 11, బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాల మేరకు అత్యధిక స్థానాలు శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ పార్టీల మహాకూటమి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సర్వేలు కూడా అవే చెప్పాయి. దీంతో మహాకూటమిలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలోకంటే ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కోల్పోతుందన్న సర్వేలతో ప్రజాసామ్య కూటమిలో ఆందోళన కనిపిస్తోంది.

 అయితే ఈ రెండు కూటమి నాయకులు మాత్రం తామే అధిక స్థానాలను గెలుచుకుంటామని ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ పార్టీల అభ్యర్థులకు ఈసారి   ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.  తిరుగుబాటు అభ్యర్థులు, బీఎస్‌పీ, ఎస్‌పీలతో పాటు మొదటిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చారు. వీరు ఒకటి నుంచి మూడు స్థానాలలో విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 డీఎఫ్‌కు గడ్డుకాలమే...
 కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమికి ఈసారి సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలు ఈ కూటమి నేతల భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ముంబైలోని ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు స్థానాలు కాంగ్రెస్, ఒక సీటు ఎన్సీపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఆ పార్టీ నేతలు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు మహాకూటమితో పాటు ఇతర పార్టీ నాయకుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో ముంబైలో డీఎఫ్ కొన్ని స్థానాలను చేజార్చుకునే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ డీఎఫ్ కూటమి నుంచి ముఖ్య నేతలు, మహా కూటమి నుంచి బరిలో నిలిచిన ప్రధాన నేతల మధ్య గట్టిపోరు జరిగిందని తెలుస్తోంది.

 మహాకూటమి....
 ప్రభుత్వ వ్యతిరేకత, అధికార కూటమిపై వచ్చిన అవినీతి ఆరోపణలు తమకు లాభిస్తాయన్న సంతోషంలో మహా కూటమి ఉంది. అయితే  పార్టీల్లోని అంతర్గత విభేదాలతోపాటు ఎమ్మెన్నెస్ ప్రభావం ఉంటే మాత్రం ఆశించిన సీట్ల కన్నా తక్కువ స్థానాలు వచ్చే అవకాశముందన్న ఆందోళన కూడా కనబడుతోంది. శివసేన పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపిన ఎమ్మెన్నెస్ వల్ల మహా కూటమికి నష్టం వాటిల్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

 ఖాతా తెరిచేనా...
 రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ గత లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే ఈసారి ఖాతా తెరుస్తామన్న ధీమాతో ఆ పార్టీ కనబడుతోంది. తొలిసారిగా పోటీచేసిన కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అయితే కొన్ని స్థానాల్లో మంచి పోటీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
 
 అస్థిత్వం కోసం...
 రాష్ట్రంలో రాజకీయ అస్థిత్వం కోసం పలు పార్టీలు పోరాడుతున్నాయి.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటునూ దక్కించుకోలేకపోయిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ , సమాజ్‌వాది పార్టీలు ఈసారి ఎలాగైన ఖాతా తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు  చేశాయి. ఈ పార్టీల అభ్యర్థులు గట్టి పోటీనిచ్చినా,  విజయం సాధిస్తారా అన్న దానిపై స్పష్టత కనబడటం లేదు. అయితే  ఈ సారి తాము విజయం సాధిస్తామని ఆ పార్టీ అభ్యర్థులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు