వాకాటికి తప్పలేదు

4 Apr, 2014 03:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డిని నెల్లూరు నుంచి లోక్‌సభ బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ తన అభ్యర్థిని తేల్చడంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన అభ్యర్థులెవరో తేలిపోయింది.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఈయనకు బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం కోసం ఎదురు చూస్తున్న టీడీపీకి రాష్ట్ర విభజన కారణంగా ఆదాల ప్రభాకరరెడ్డి దొరికారు. కావలి ఎమ్మెల్యే స్థానం మీద కన్నేసి టీడీపీలో చేరాలనుకున్న ఆయన ఆశలు నెరవేరక పోవడంతో చివరకు లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో జిల్లాలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికే బలమైన అభ్యర్థులు దొరకని స్థితి ఏర్పడింది.
 
 ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని లోక్‌సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచించారు. ఈ ప్రతిపాదనకు రామనారాయణరెడ్డి ససేమిరా అంటూ తాను మరోసారి ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. మరో అభ్యర్థి కోసం అన్వేషించిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి దిక్కయ్యారు. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఈ ప్రతిపాదన రాగానే వాకాటి తన నిరాసక్తతను వెల్లడించారు.
 
 తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కోరారు. అయితే నెల్లూరు లోక్‌సభ బరిలోకి దూకడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ హై కమాండ్ బలవంతంగా వాకాటి మెడలో గంట కట్టింది. ఈ మేరకు గురువారం రాత్రి  ఆయన పేరు ఖరారు చేశారు. అంతా అయ్యాక వాకాటి మళ్లీ ఉహూ అనకుండా ఉండేందుకు పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను ఒప్పించే పనిలో పడ్డారు.
 
 తిరుపతికి చింతానే ఇదిలా ఉండగా తిరుపతి లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన జాబితాలో ఆయన పేరు చేర్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానం నుంచి పోటీ తప్పదనే అంచనాతో చింతా మోహన్ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు