కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

12 May, 2014 23:54 IST|Sakshi
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్  :పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పోలీస్ బాస్‌లు ప్రణాళికబద్ధంగా సిబ్బందికి విధులు కేటాయించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీస్ బలగాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ విధానం వల్ల ఓట్ల లెక్కింపులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులను ఎస్పీలు జె. సత్యనారాయణ, జెట్టి గోపీనాథ్  పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ నిబంధ నలు, ఆంక్షలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 144వ సెక్షన్, పోలీస్ యాక్టు-30 అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల సమీపంలో గుంపులుగా నిలబడినా, అల్లర్లుకు పాల్పడినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాలను కూడా నియమించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ యాత్రలు చేయడాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు.
 
 జిల్లాలోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. గుంటూరులోని హిందూ ఫార్మశీ, ఏఎల్ బీఈడీ, టీజేపీఎస్, ఏసీ కళాశాల, నల్లపాడులోని సెయింట్ జోసఫ్ మహిళా కళాశాలల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఏఎస్పీలు నలుగురు, డీఎస్పీలు 14, సీఐలు 35 మందితోపాటు మొత్తం 1500 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు... కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని, వాహనదారులు సహకరించాలని డీఎస్పీ బిపి.తిరుపాలు కోరారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేవారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను నిర్థేసించిన ప్రాంతాల్లో నిలుపుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో రోడ్లపై వాహనాలు నిలిపితే సీజ్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.  కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వ రకు సమీపంలోని ప్రధాన రోడ్లలో ఓ వైపు రోడ్డును మూసివేస్తున్నారు.
 
  అమరావతి రోడులోని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేవారు అదే రోడ్డులోని హిందూ ఫార్మసీ బోయస్ హాస్టల్ గ్రౌండ్‌లో నిలుపుకోవాలి. లాడ్జి సెంటర్‌లోని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళేవారు నార్త్ ప్యారిష్ చర్చి వెనుక వైపు వాహనాలు పార్క్ చేయాలి. హిందూ కళాశాలకు వచ్చే వాహనదారులు ఉల్పాహాల్ గ్రౌండ్ , టీజేపీఎస్ కళాశాల వద్దకు వచ్చే వాహనాలను పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేయాలి. పాతగుంటూరు:   నగరంలోని ఆంధ్రా లూథరన్ బీఈడీ కళాశాల, అమరావతి రోడ్డులోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను సోమవారం  వెస్ట్ డీఎస్పీ నాగరాజు పరిశీలించారు.  కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ రెండు కౌంటింగ్ కేంద్రాల్లో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అరండల్‌పేట సీఐ వెంకటశేషయ్య, సిబ్బంది తదితరులున్నారు.
 

మరిన్ని వార్తలు