అష్టదిగ్బంధం

26 Apr, 2014 04:09 IST|Sakshi

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :  జిల్లాలో ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తోంది. పది నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కేంద్ర బలగాలు, ప్రత్యేక, సాధారణ పోలీసులను వినియోగించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 9,800 మంది పోలీసులను వినియోగించున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చేసే అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే చర్యలు తీసుకుంటున్నారు.

 జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు
 సార్వత్రిక ఎన్నికలను పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ ఒక్కో కంపెనీల్లో 120 మంది సిబ్బంది ఉంటారు. ఒక కంపెనీ తమిళనాడు సాయుధ బలగాలు, మూడు కంపెనీల ఇండో-టిబెటేన్ బార్డర్ పోలీసులు, నాలుగు కంపెనీల బార్టర్ సెక్యురిటీ ఫోర్( బీఎస్‌ఎఫ్), నాలుగు కంపెనీల సీఆర్‌పీఎఫ్ పోలీసులు, జార్కండ్ రాష్ట్రం నుంచి మూడు కంపెనీల బలగాలు త్వరలో జిల్లాకు చేరుకోనున్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న 18 మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల పర్యావేక్షణ కోసం ఈనెల 27న జిల్లాకు రానున్నారు. వీరిని పది అసెంబ్లీ స్థానాల్లో నియమించనున్నారు.

 మావోయిస్టుల గాలింపునకు హెలిక్యాప్టర్..
 ఏజెన్సీలో ఈ సార్వత్రిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్ర త చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టుల వల్ల ఎన్నిక ల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ తీవ్రతరం చేస్తున్నారు. గగనతలం నుంచి మావోయిస్టుల ముప్పును పసిగట్టేందుకు ఒక హెలిక్యాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ఏప్రిల్ 28 తేదీ వరకు ఇది జిల్లాకు రానుంది. ఈ మద్య నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని పోలీసు శాఖ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలనే పట్టుదలతో పోలీసు శాఖ ఉం ది. గిరిజన ప్రాంతాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ ఓటింగ్ నమోదయ్యే దిశగా ఓటర్లు, పోలింగ్ బూత్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 భద్రత కట్టుదిట్టం..
 జిల్లాలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2,318 పోలింగ్ కేంద్రాల్లో 185 కేంద్రాలు అతి సమస్యాత్మకంగా, 340 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, 79 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున స్వయం పర్యవేక్షణలో నలుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 1800 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 3 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది మహిళ పోలీసులు, 800 మంది హోంగార్డులు వీరితోపాటు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన 2,500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో అత్యధిక  శాతం మందిని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ బూతులకు తరలించనున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 42 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బార్లు, రెస్టారెంట్లకు రాత్రి 11 గంటల వరకు గడువుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు