ఆశల పందిరి

19 May, 2014 01:08 IST|Sakshi
ఆశల పందిరి

ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో చాలా ఏళ్ల తరువాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. ఆ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహుల జాబితా కూడా పెద్దగా ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జోరందుకున్నాయి.
 
అయితే సీనియర్లకే మంత్రి పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాల భోగట్టా. దీంతోపాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇద్దరిని తప్పకుండా మంత్రి పదువులు వరిస్తాయనే ఆశాభావంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండో సారి విజయం సాధించిన ఉండి ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు(శివ), నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాతకు అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉండి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేశారని, పా ర్టీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు కొట్టేశారని చెబుతున్నారు.
 
కమ్మ సామాజిక వర్గానికి చెంది న బూరుగుపల్లి శేషారావుకు కూడా అవకాశం ఉందనే పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుందని వినిపిస్తోంది. ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గతంలో ఆచంట నుంచి విజయం సాధించారు. తాజాగా చింతలపూడి నుంచి అనూహ్యంగా గెలుపొందారు. ఈ సామాజిక వర్గం కోటా కింద ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు తర్వాత మంత్రి పదవుల విషయమై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. 

>
మరిన్ని వార్తలు