చంద్రబాబులా అబద్దాలు చెప్పను: వైఎస్ జగన్

23 Apr, 2014 22:09 IST|Sakshi
చంద్రబాబులా అబద్దాలు చెప్పను: వైఎస్ జగన్

గుంటూరు: చంద్రబాబు నాయుడు మాదిరిగా తన అబద్దాలు ఆడలేనని, ఏ వ్యక్తి అయితే పేదవాడి మనసు ఎరుగుతాడో అలాంటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట, వినుకొండలలో జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో ఆయన ప్రసంగించారు. ఇన్నాళ్లైనా వైఎస్ఆర్ ఎక్కడున్నాడు అంటే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నారని చూపుతున్నారన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా తయారయిందని బాధపడ్డారు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి కోసం ఆరాటపడాలన్నారు. కాని నేటి రాజకీయాలు ఏ మనిషిని తప్పిస్తే ఓట్లు పడతాయా అనేలా  వ్యవస్థ వచ్చిందన్నారు.

అధికారం కోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరోజూ  సీఎం హోదాలో చంద్రబాబు  ప్రజల వద్దకు వెళ్లలేదని, వారి కష్టాలు పట్టించుకోలేదని చెప్పారు. అదే విషయాన్ని చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు ప్రశ్నించండన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో  చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిరుపేదల బియ్యాన్నిరూ.2 నుంచి రూ.5.25 లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో బెల్టు షాపును తీసుకొచ్చింది మీరేనని గట్టిగా చంద్రబాబును ప్రశ్నించండన్నారు.

సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే ఎందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని కూడా చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు అడగండన్నారు.  ఒక మనిషిని పొడిచేయడం, అ తర్వాత అదే మనిషి ఫోటోకు రాజకీయాల కోసం దండేయం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. అదే వ్యక్తికి మనల్ని మోసం చేయడం కొత్తేమీ కాదన్నారు. ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబు పట్టపగలే అబద్ధాలు ఆడుతూపోతున్నారని విమర్శించారు.  ఇంటింటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని, ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  చంద్రబాబూ  రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో మీకు తెలుసా? 20 లక్షలు మాత్రమే ఉద్యోగాలు ఉంటే, మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు.

చంద్రబాబు మాదిరి తాను అబద్ధాలు ఆడే వ్యక్తిని కాదని చెప్పారు. చంద్రబాబు మాదిరి విశ్వసనీయతలేని రాజకీయాలు చేయలేనన్నారు.  చంద్రబాబు మాదిరి నిజాయితీలేని రాజకీయాలు చేయలేనని హామీ ఇచ్చారు. వీటన్నిటికీ కారణం  తానకు వారసత్వంగా వైఎస్ఆర్ నుంచి వచ్చింది విశ్వసనీయతేనని గర్వంగా చెప్పారు.

మరిన్ని వార్తలు