కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నా: కొండా సురేఖ

19 Mar, 2014 02:37 IST|Sakshi
కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నా: కొండా సురేఖ

సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతులు మంగళవారం ఉదయం టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన నివాసంలో సమావేశమై సుమారు గంటన్నరపాటు చర్చించారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, వరంగల్ తూర్పు నియోజకవర్గం కేటాయింపు వంటి అంశాలపై కేసీఆర్‌తో వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలసి మీడియాతో మాట్లాడారు.
 
 తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నానని, ఇప్పటిదాకా ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ విధానాలకు అనుగుణంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అందులో భాగంగానే మహబూబాబాద్‌లో ఘటన జరిగిందని వివరణనిచ్చారు. మానుకోటలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డి అప్పట్లో ఓదార్పు యాత్రలో భాగంగానే వచ్చారని, సమైక్య నినాదంతో కాదని తెలిపారు.  
 
 వరంగల్ తూర్పు నుంచి సురేఖ పోటీ: కేటీఆర్
 కొండా దంపతుల చేరికతో వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ బలపడిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా విడిగా ఉన్న వివిధ పార్టీల్లోని నేతలు పునర్నిర్మాణంలో అయినా కలసిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ పోటీచేస్తారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు