పల్లెల్లోనూ హస్తం గల్లంతు

15 May, 2014 02:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం : పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బ తినింది.
 
 ఆ పార్టీ దరిదాపుల్లో కూడా లేకుండా ఓటర్లు తరిమి కొట్టారు. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర పరిధిలో అగళి, అమరాపురం, గుడిబండ, మడకశిర జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను పోటీ చేయించినా ఏ ఒక్కరూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే జిల్లాలో కేవలం నాలుగింటికే కాంగ్రెస్ పరిమితమైంది. జిల్లాలో 63 జెడ్పీటీసీ, 849 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్  విడుదలైంది. 12 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 837 స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. వీటిలో వైఎస్సార్‌సీపీ తరఫున 808 మంది అభ్యర్థులు, టీడీపీ 817, కాంగ్రెస్ 213, సీపీఎం 34, సీపీఐ 24, బీజేపీ 24, బీఎస్పీ, లోక్‌సత్తా నుంచి ముగ్గురు చొప్పున, స్వతంత్ర అభ్యర్థులుగా 201 మంది పోటీ చేశారు. 213 మంది కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ నలుగురు మాత్రమే విజయం సాధించడం గమనార్హం. చిలమత్తూరు మండలంలో రెండు, మడకశిర మండలంలోని రెండు స్థానాల్లో మాత్రమే వారు గెలుపొందారు. మిగిలిన 209 మందికి డిపాజిట్టు కూడా దక్కలేదు.
 
 63 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 63 మంది, టీడీపీ 62, కాంగ్రెస్ 30, బీజేపీ 19, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నుంచి పది మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 55 మంది పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు అతి తక్కువగా ఓట్లు లభించాయి. లక్ష్మినరసమ్మ (మడకశిర) 6141 ఓట్లు, జి.నాగరాజు (చిలమత్తూరు) 5075, అనిత(అగళి) 4239, ఆర్.హేమ (అమరాపురం) 3393  ఓట్లు సాధించి పర్వాలేదనిపించినా.. మిగతా వారు మాత్రం కనీస స్థాయిలో సంపాదించలేకపోయారు.
 
 జి.శివమ్మ (బ్రహ్మసముద్రం) 1224, ప్రమీలాబాయి (బుక్కపట్నం) 248, టి.వెంకటరెడ్డి (చెన్నేకొత్తపల్లి) 913,  వి.అరుణ (గార్లదిన్నె) 249, ఆరిఫ్ (గోరంట్ల) 366, గోవిందరాజులు (గుడిబండ) 883, అశ్వర్థనారాయణప్ప (హిందూపురం) 720, రామచంద్రప్ప (కళ్యాణదుర్గం) 1066, మంజునాథ చౌదరి (కంబదూరు) 1041, తిరుపాల్ (కనగానపల్లి) 132, లక్ష్మిదేవి (కొత్తచెరువు) 289, ఏ.లలిత (కూడేరు) 151, క్రిష్ణమూర్తి (కుందుర్పి) 333, ఆదినారాయణప్ప (లేపాక్షి) 481, రవీంద్ర (నల్లమాడ)352, మనోహర్ నాయుడు (ఓడీచెరువు) 499, సి.బి.రవీంద్ర (పరిగి)1636, కొండల రాయుడు (పెనుకొండ) 498, గవ్వల కర్ణ (రాప్తాడు) 84, ఓబిళేసు (రొద్దం) 2638, మల్లప్ప (రొళ్ల) 1055, హిమబీ (శెట్టూరు) 904, కిష్టప్ప (సోమందేపల్లి) 1933, యల్లమ్మ (వజ్రకరూరు) 248, రాజశేఖర్ (విడపనకల్లు) 434 ఓట్లు సాధించారు. ఉరవకొండ అభ్యర్థి రమాదేవికి కూడా అతి తక్కువ ఓట్లు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు