మావోయిస్టుల ‘ఎన్నికల పంజా’

13 Apr, 2014 01:10 IST|Sakshi
మావోయిస్టుల ‘ఎన్నికల పంజా’

చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ పేట్రేగిపోయారు. ఈ నెల 10న బస్తర్ లోక్‌సభ స్థానానికి జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్న వేళ మెరుపు దాడులకు తెగబడ్డారు. శనివారం బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో గంట వ్యవధిలో ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న ఒక బస్సుతోపాటు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న  108 అంబులెన్సును మందుపాతర్లతో పేల్చేశారు. ఈ ఘటనల్లో ఏడుగురు ఎన్నికల సిబ్బంది, ఆరుగురు జవాన్లు సహా 15 మంది మృత్యువాతపడ్డారు.
 
ఈవీఎంలతో తిరిగొస్తుండగా...
బీజాపూర్ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో ఈ నెల 10న ఎన్నికల విధులు చేపట్టిన పోలింగ్ సిబ్బంది శనివారం తిరుగు ప్రయాణంలో 20-25 కి.మీ. కాలినడకన తొలుత కుట్రు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
 
 అక్కడి నుంచి ఈవీఎంలను తీసుకుని బస్సులో బీజాపూర్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఉదయం సుమారు 11 గంటలకు ఎరంనార్ అటవీ ప్రాంతంలోకి రాగానే మావోయిస్టులు మందుపాతర పేల్చి ఆపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నికల సిబ్బంది రామచంద్రం, సోనాల్ విజయ్, కొర్సం శంకర్, అన్నపల్లి పాండు, సోమయ్య, సూర్యనారాయణ, మల్లారం మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో 100 మంది నక్సల్స్ పాల్గొన్నట్లు సమాచారం.
 
దర్బాఘాట్‌లో 108 అంబులెన్సు పేల్చివేత
బస్తర్ జిల్లాలోని దర్బా డివిజన్‌లో ఎన్నికల విధులు ముగించుకున్న పోలింగ్ సిబ్బంది జగ్దల్‌పూర్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా సీఆర్పీఎఫ్ 80వ బెటాలియన్‌కు చెందిన 10 మంది జవాన్లు తొలుత రోడ్డు తనిఖీకి బయలుదేరారు. మార్గమధ్యంలో 108 సంజీవని అంబులెన్సు కనిపించడంతో అందులో ఎక్కారు.
 
 జవాన్ల కదలికలను గమనిస్తూ వచ్చిన నక్సల్స్ అంబులెన్సు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు దర్బాఘాట్ పరిధిలోని కామనార్ ప్రాంతానికి రాగానే శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. పేలుడు ధాటికి అంబులెన్సు తునాతునకలై ఘటనాస్థలంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ పేలుడులో జవాన్లు ఏకే రాయ్, నరేష్ కుమార్, సీమారాం, ఉమేష్‌కుమార్, కాంతిబాయ్, దినేష్ కుమార్, అంబులెన్సు డ్రైవర్ వాసు సేఠియా, టెక్నీషియన్ శ్రవణ్‌కుమార్ నేతం అక్కడికక్కడే మృతిచెందారు. రెండు ఘటనల్లో గాయపడిన వారిని  హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించారు. కాగా, నక్సల్స్ దుశ్చర్యను ఉగ్రవాద దాడిగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అభివర్ణించింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు పేద టీచర్లు, ఇతర పౌరులను పొట్టనబెట్టుకున్నారంది.
 
 బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: సీఈసీ
 నక్సల్స్ దాడుల్లో ఎన్నికల సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న జవాన్లు మృతిచెందడంపట్ల కేంద్ర ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెన్నైలో తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు