‘పరిశ్రమ’తో నవ నిర్మాణం

28 Mar, 2014 01:03 IST|Sakshi
‘పరిశ్రమ’తో నవ నిర్మాణం

నవ తెలంగాణ:  ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే... ముందు చూపుగల రాజకీయ నాయకత్వం, ఆర్థిక లక్ష్యాలు, భౌగోళిక పరిస్థితి అవసరం. తెలంగాణ నవ నిర్మాణం ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణలో ప్యూడల్ వ్యవస్థ వేళ్లూనికొని పోవడంతో ఇక్కడ పాఠశాలల ఏర్పాటు జరగలేదు. గ్రామీణ జీవితమంతా భూస్వామ్య వ్యవస్థలోనే ఉండేది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ నాయకత్వం అంతా భూస్వామ్య భావజాలం ఉన్నవారే. ఆ ఊళ్లల్లో ఉండే సమాజమే ఆ నాయకత్వ లక్ష్యం. ప్యూడల్ రాజకీయాల్లో వారసత్వం, అసమానతలు, కులవ్యవస్థ, అంటరానితనం ప్రధానంగా ఉంటాయి. పేరుకు ప్రజాస్వామ్యమే కానీ ప్యూడల్ వ్యవస్థ నిర్మాణమే ఉందిక్కడ. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి ఉండగా హైదరాబాద్‌లో ఐఐటీ నెలకొల్పేందుకు జర్మనీ వాళ్లు ముందుకు వచ్చారు. సంజీవరెడ్డి ఐఐటీ తమకొద్దని జవహర్‌లాల్ నెహ్రూకు చెప్పొచ్చాడు. మనం తిరస్కరించిన ఐఐటీని మద్రాసుకు ఎగురేసుకుపోయారు అప్పటి రాజగోపాలాచారి. ఇలా ప్యూడల్ వ్యవస్థ పునాదుల మీద వ చ్చిన నాయకత్వం పూర్తిగా గ్రామీణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది.

 సంపద సరైన పంపిణీ...
 సంపదను సృష్టించడం ప్రధానం కాదు. ఆ సంపదను పంపిణీ చేసే పద్దతి తెలియాలి. ప్రస్తుతం ఆ సంపదలో 80 శాతం ధనికుల చేతుల్లోనే ఉండిపోయింది. రియల్ ఎస్టేట్ వచ్చి పేదలకు భూమి లేకుండా చేసింది. పోలవరం ద్వారా రాబోయే సంపద ఎవరి నుంచి వచ్చింది? దానికోసం భూములిచ్చిన గిరిజనుల నుంచే వచ్చింది. మరి వారికి ఆ పోలవరం నుంచి వచ్చే సంపద ఉపయోగపడుతుందా? లేనే లేదు. మరి ఆ సంపద సృష్టి ఎవరికోసం? ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రజల నాడిని గుర్తించకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు సామాజిక మార్పు కోసం పోరాడారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నవ నిర్మాణంపై విస్తృతస్థాయిలో చర్చ జరగాలి.
 
 పారిశ్రామికీకరణే కీలకం
 తెలంగాణలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ సంఖ్యను 50 శాతానికి తగ్గించాలి. ఎందుకంటే మనకు నీటి వనరులు తక్కువ. ఎత్తు భూములు కాబట్టి ప్రాజెక్టులు నిర్మించలేం. ఎత్తిపోతలు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మన వ్యవ సాయం కేవలం 50 శాతం మందికే జీవనాన్ని ఇవ్వగలదు. మిగిలిన 30 శాతం మందిని కూడా ఇతర రంగాలకు మళ్లించాలి. వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా వ్యవసాయం నుంచి బయటకు రప్పించలేం. అలాంటి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకొచ్చే ముందుచూపు నాయకత్వమే అవసరం. తెలంగాణ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. కరీంనగర్ చుట్టూ గ్రానైట్స్ గనులు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి పెంచవచ్చు. పరిశ్రమలకు ఇది ఎంతో అనువైన ప్రాంతం. అణుశక్తికి ఉపయోగించే యురేనియం నిల్వలు ఆదిలాబాద్‌లో లభ్యమవుతున్నాయి.  దాంతో యురేనియాన్ని ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్ర యించవచ్చు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత ప్రధానమైంది. విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి.  
 
 విద్యా వైద్యంపై కేంద్రీకరణ
 విద్యారంగంపై దృష్టి పెట్టకపోతే ఎక్కడా అభివృద్ధి జరగదు.  విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలి. అందరికే ఒకే రకమైన విద్యను అందజేయాలి. గ్రామాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి. ఈ ప్రయోగాన్ని క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో అమలు చేశారు. క్యూబాలో విద్య కోసం ఖర్చు చేశారు. ప్రాథమిక, ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఆ దేశాల్లో విస్తృతంగా అభివృద్ధి జరిగింది.  క్యూబా డాక్టర్లను వివిధ దేశాలకు సరఫరా చేయగలిగే స్థితికి చేరుకుంది. స్విట్జర్లాండ్ పక్కనే ఉన్న దేశం ఫిన్లాండ్. ఆ దేశం అమెరికాతో పోటీపడి సమానంగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) సాధించింది.
 
  కానీ ఆ దేశానికి ఉన్న వనరులు చాలా తక్కువ. ఇండోనేషియా నుంచి మంచినీళ్లు, కంబోడియా నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుంది. కేవలం నౌకాయానం ద్వారా వచ్చే పన్నుల ద్వారానే ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దాంతోనే ప్రాథమిక విద్యను అభివృద్ధి చేశారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే టెక్నాలజీ పెరగాలి. టెక్నాలజీ పెరగాలంటే విద్య మీద కేంద్రీకరించాలి. ఎక్కడైతే తల్లులు పౌష్టికాహారం తింటారో అక్కడ మేధావులు పుడ్తారు. మెదడు తల్లి గర్భంలోనే పుడుతుంది. క్యూబాలో గర్భిణుల మీద దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందరికీ అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉండాలి. పౌష్టికాహారం గ్యారంటీ చేయాలి. వీటిమీద అవగాహన ఉన్న నాయకత్వం తెలంగాణను పరిపాలించాలి.

అసమానతలు, కులవ్యవస్థకు మూలమైన ఫ్యూడల్ వ్యవస్థ అంతరించి  రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమూల మార్పులు రావాలని, అప్పుడే తెలంగాణ పునర్వికాసం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభిప్రాయపడుతున్నారు...

- మాజీ ఎమ్మెల్సీ
 చుక్కా రామయ్య అంతరంగం

>
మరిన్ని వార్తలు