గజ్వేల్ కోలుకోలేని దెబ్బ

20 May, 2014 00:05 IST|Sakshi
గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ

గజ్వేల్, న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్‌లోనితెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది.
 
 నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా  తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 
 టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు వీరే..
 కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్‌రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్‌నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్‌తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.
 
 అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి
గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు