సమస్యల సవాళ్లు

19 May, 2014 00:20 IST|Sakshi
సమస్యల సవాళ్లు

 సాక్షి ప్రతినిధి, గుంటూరు :కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులకు పెండింగ్ ప్రాజెక్టులు స్వాగతం పలుకుతున్నాయి. డెల్టా ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి మరమ్మతులు, మూలనపడిన ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలుగా మారాయి. జిల్లా కేంద్రమైన గుంటూరులో అస్తవ్యస్తంగా ట్రాఫిక్, విస్తరించని రహదారులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికీ గుంటూరులో తాగునీటి సరఫరా అర్ధరాత్రి జరుగుతోంది. దీంతోపాటు రూ.600 కోట్ల విలువైన తాగునీటి పథకాల పనులు ఇంకా ఊపందుకోలేదు.
 
 జిల్లాలో టీడీపీ నుంచి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు, 12 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్లు. గతంలో వీరంతా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు చేసినవారే. గ్రామస్థాయిలో ఉద్యమాలు, పాదయాత్రలు చేసి వాటి పరిష్కారానికి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ముఖ్యంగా సాగునీటి స్థిరీకరణకు దివంగత మహానేత వైఎస్ చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో పూర్తికాక పోయినా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్‌గేట్లను ఇంకా అమర్చాల్సి ఉంది. దీనికితోడు పునరావాస ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించాల్సి ఉంది.
 
 ఈ రెండు పనులు ఈ సీజనులో పూర్తి అయ్యే అవకాశాలు లేవు. వీటిని పూర్తిచేయాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుందని, అందుకు అవసరమైన పూర్తి నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కొంతకాలంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త పాలకులు రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ముంపు గ్రామాల ప్రజలకు చెల్లించాల్సిన నష్టపరిహారం కోసం అక్కడి ప్రజలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ నేతలు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
 
 ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు అవశ్యం..
 డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో ప్రకాశం బ్యారేజి పనులను కూడా చేర్చడంతో సాగునీటిశాఖ అధికారులు ఈ ప్రాజెక్టుకు సాంవత్సరిక మరమ్మతులు కూడా చేయడం లేదు. దీంతో దిగువ ఆప్రాన్ శిథిలావస్థకు చేరింది. రానున్న ఖరీఫ్ సీజను దృష్టిలో ఉంచుకుని దిగువ ఆప్రాన్‌కు మరమ్మతులు చేయాల్సి ఉందని ఇటీవల బ్యారేజి పరిరక్షణ కమిటీ అప్పటి ప్రభుత్వానికి సూచించింది. ప్రకాశం బ్యారేజి పరిరక్షణపై కృష్ణా జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా సాగునీటి కొరత, సరఫరా సమస్యలపై అనేకసార్లు చేసిన ఆందోళనలు ప్రజలు మరిచిపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యారే జీకి అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంది.
 
 నిధులు సమకూర్చితేనే సాగునీరు..
 కృష్ణానదీ పరీవాహానికి ఇరుపక్కల నిర్మితమైన ఎత్తిపోతల పథకాలకు నాలుగేళ్లుగా మరమ్మతులు జరగడం లేదు. ముఖ్యంగా వీటి మరమ్మతులకు అవసరమైన నిధులను వాటిని నిర్వహిస్తున్న సొసైటీలే సమకూర్చాల్సి ఉంది. ఈ సొసైటీలపై అటు ఇరిగేషన్‌శాఖకు, ఇటు రెవెన్యూశాఖకు పూర్తిస్థాయిలో అధికారాలు లేవు. దీనితో వాటికి సంబంధించిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 30 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పనిచేయకపోవడంతో 23 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా జరగడం లేదు. ఈ పథకాల బాధ్యతలను చేపట్టిని సొసైటీలకు అవసరమైన నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కొత్త పాలకులపైనే ఉంది. విజయవాడ నుంచి కృష్ణానది కుడి, ఎడమ కరకట్టలను ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రారంభిస్తే, ఎడమ కరకట్ట నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలైంది. కుడివైపున కరకట్ట పనులను ఇటీవలనే నిర్మాణ సంస్థ ప్రారంభించింది. రూ.150 కోట్ల విలువైన ఈ కరకట్టను పూర్తి చేస్తే రేపల్లె వరకు పంట భూములకు ముంపు బెడద తొలగుతుంది. రహదారి సౌకర్యం ఏర్పడుతుంది.
 
 ఉడాకు సిబ్బంది కొరత..
 మంగళగిరి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఐదేళ్లుగా పాలకులు చేస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. భూసేకరణ, నిధుల సమీకరణ కోసం కొంత ప్రయత్నం జరిగినా అది ముందుకు సాగలేదు. వీజీటీఎం ఉడా పరిధిని విస్తరించారే కాని అందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉడా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం 86 మంది కొత్త ఉద్యోగులను నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రాకపోవడంతో పరిమితంగా ఉన్న సిబ్బంది కారణంగా ఉడాలోని పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
 
 నగరవాసుల దాహార్తి తీరేనా?
 గుంటూరు నగరంలో రూ.600 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులకు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. నగరంలోని ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండటంతో ఆర్టీసీ కొత్తగా సిటీ బస్‌లను మంజూరు చేసినా, వాటిని వినియోగంలోకి తీసుకురాలేని దుస్థితి ఉన్నది. రహదారుల విస్తరణతోపాటు ఆటోల సంఖ్య, నగరంలో కొత్త ఆటోల కొనుగోలు నిలిపివేయడం వంటి అనేక ముఖ్యపనులు కొత్త పాలకుల ముందున్నాయి. నగరంలోని రైల్వే గేట్ల సమస్య కారణంగా ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేస్తారని ప్రజలు ఆశతో ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు