మా ఓటు భద్రతకే..

22 Mar, 2014 01:03 IST|Sakshi

ఐటీ ఉద్యోగినుల మనోగతం
ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారికీ వరాలివ్వడం సహజం. వారి మేనిఫెస్టోల్లో ఈసారి తమ భద్రతకు చోటివ్వాలని కోరుతున్నారు ఐటీ ఉద్యోగినులు. ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో వారు ఈ డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఇంకా మెరుగు పడాల్సి ఉందని పేర్కొంటున్నారు.    
 - సాక్షి, హైదరాబాద్
 
పనివేళలు నిర్ధారించాలి
ఐటీ ఉద్యోగులు తమకు అప్పగించిన పని పూర్తి చేసే వరకు.. అది ఎన్ని గంట లైనా ఉండి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ రాత్రయితే ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అందుకే ఎనిమిది గంటల పని విధానం అమలు కావాలి.                                                      
 - ప్రవలిక్ల, ఐటీ ఉద్యోగి
 
 రవాణాపై దృష్టి పెట్టాలి
ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగు పర్చేందుకు, ఐటీ జోన్‌లో మహిళల భద్రతా చర్యలపై ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వాలి. అంతే కాకుండా ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటుకు కృషి చేయాలి.
 - శిరీష, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్
 
 చిత్తశుద్ధి అవసరం
మహిళా ఐటీ ఉద్యోగుల భద్రత కోసం తీసుకునే చర్యలను రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి. వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే ఉన్న వనరులతోనే ఎంతవరకు రక్షణ కల్పిస్తామనే అంశంపై కూడా నాయకులు దృష్టి సారించాలి. కేసుల కోసం సైబరాబాద్‌లో ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- పూర్ణిమ, ఐటీ ఉద్యోగి
 
 పటిష్ట చట్టాలు అవసరం
 ఏదైనా ఘటన జరిగినప్పుడు రాజకీయ పక్షాలు స్పందించి, ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాకాకుండా ఉద్యోగినుల భద్రతపై పటిష్టమైన చట్టాలు చేయాలి. ఐటీ కారిడార్‌లో ఇంకో 100 సీసీ కెమెరాలను అమర్చాలి.  కంట్రోల్ రూమ్‌లో మల్టిపుల్ స్క్రీన్ ఏర్పాటు చేయాలి. పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలి.  
 - వనజ, హెచ్‌ఆర్ మేనేజర్
 
 మా సెర్మం వొలిసి...
 ‘తాత అయ్యలప్పట్నుంచి గీ పనే సేత్తన్నం. కైకిలి(కూలీ)కెళ్లినా ఎక్కువ పైసలొత్తయి. అయినా మోచీగా తప్ప ఇంకో పని సెయ్యలేం. పొద్దట్నుంచి కూసోని సెప్పులు కుడ్తే ముప్పయ్ రూపాయలు కూడా అత్తలేవు. ఆ పైసలతో మేం ఎట్టా బతికేది? మా బిడ్డల గతేంది? నా పెనిమిటి పోయి ఏడేండ్లయింది. ఇద్దరు బిడ్డలున్నరు. ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు గుంజుకున్నరు. ఎన్నిమాట్ల దరఖాస్తులు ఇచ్చినా వితంతు పింఛినీ ఇత్తలేరు. ఉన్నోళ్లకే రేషన్‌కారట్లున్నయ్.. కారట్లున్నాగానీ కొందరికి బియ్యం ఇత్తలేరు.. మా అసంటోళ్లు రూ.50 పెట్టి బియ్యం కొనుక్కుంటరా..? మాకు పింఛన్లు లేవు.. రుణాలు లేవు.. ఇళ్లు లేవు.. సర్కారోళ్లు ఏం ఇయ్యకుంటే ఎట్ల బతకాలే? మేమేం లీడర్ల ఆస్తులు రాసియ్యి అంటలేం.. కొంచెం సెప్పులు కుట్టే సామాను ఇప్పిస్తే సాలు. ఆరె, గూటం, బొడ్డెలు, రివిట్లు, దారం, తోలు, కత్తులు ఇస్తే మేలు. ఎలచ్చన్ల ముంగట అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని అస్తరు.. ఎన్నికలైన తెల్లారే అన్నీ యాదిమరుస్తరు.. దొరా.. కూసొని కూసొని కాళ్లు నొత్తన్నయ్.. కుట్టీ కుట్టీ చేతులన్నీ నాడాలవుతన్నయ్.. దరిద్రంలోనే తరాలెల్తన్నయ్! బాంచెన్.. మా కుండలల్ల గింత గంజి బోయిండ్రి.. మా బతుకులకింత వెలుగునియ్యుండ్రి.. మా సెర్మం వొలిసి మీకు సెప్పులు కుట్టిత్తాం.’’     
- మణెమ్మ, ఖమ్మం

>
మరిన్ని వార్తలు