జేసీ పవన్, అస్మిత్‌రెడ్డిలపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు

25 Apr, 2014 10:37 IST|Sakshi

అనంతపురం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి జేసీ దివాకరరెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలపై  తాడిపత్రి మేజిస్ట్రేట్ కోర్టు గురువారం  నాన్‌బెయిలబుల్ వారెంట్లు  జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2009 ఏప్రిల్ 24న తెలుగుదేశం పార్టీకి చెందిన కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేసి వస్తువుల్ని దహనం చేశారని తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 14 మందితో పాటా  పవన్‌కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు కూడా నిందితులు. అదే సమయంలో నమోదైన మరో కేసు లోనూ వీరిద్దరి పేర్లను తొలుత చేర్చి తరువాత తొలగించారు. ఈ విధంగానే ఇంటిపై దాడి కేసులోనూ పేర్లు తొలగించాలని వారు హోం మంత్రికి అర్జీ పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ కోర్డు విచారణ నివేదిక ఆధారంగా వారి పేర్లను తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితులు గుత్తి సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. గుత్తి సెషన్స్ కోర్టు నిందితుల పేర్లు తొలగించరాదని తీర్పు వచ్చింది.

దీనిపై నిందితులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి 2013లో స్టే తెచ్చుకున్నారు. 2014 ఏప్రిల్ 4న స్టే తొలగించడంతో సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ తిరిగి గురువారం నిందితుల జాబితాలో చేర్చి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ పవన్, అస్మిత్‌లను అరెస్ట్ చేయడానికి వారి ఇంటి వద్దకు వెళ్లగా, వారు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి