కడపను గ్రీన్‌సిటీగా మారుస్తాం..

21 Mar, 2014 02:43 IST|Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు
 కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని భూగర్భ డ్రైనేజి వల్ల దెబ్బతిన్న రోడ్లన్నీ బాగుచేసి పచ్చదనాన్ని, పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా కడపను గ్రీన్‌సిటీగా మార్చడమే తమ లక్ష్యమని  మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయనను గురువారం ‘సాక్షి’ పలకరించింది.
 
 ప్రశ్న : కడప నగరం ఇప్పటివరకు ఎంతమేర అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు?
 జవాబు : గతంలో మున్సిపాలిటిగా ఉన్న కడప, చెమ్ముమియాపేట, చిన్నచౌకు వంటి పంచాయతీలను కలుపుకొని కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. నేను జెడ్పీఛెర్మైన్‌గా ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉండేది. అయినప్పటికీ 40కోట్లతో లింగంపల్లె వాటర్‌స్కీమ్ తెచ్చి ఎన్‌జీఓ కాలనీని వర్షపునీరు ముంచెత్తకుండా రక్షణ గోడ నిర్మించాం. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కడప నగరం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది.
 
 ప్రశ్న : మీరు మేయర్ అయితే నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ప్రాధాన్యతా అంశాలేవి?
 జవాబు : పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, సోమశిల బ్యాక్ వాటర్‌స్కీమ్‌ను పూర్తి చేయడం ద్వారా కడపకు 24గంటలు తాగునీరు అందించడం, భూగర్భ డ్రైనేజి వల్ల పాడైపోయిన రోడ్లన్నింటినీ మళ్లీ బాగు చేయడమే మా ముందున్న ప్రాధాన్యతాంశాలు.
 
 ప్రశ్న : వర్షాకాలంలో నగరంలో పలు ప్రాంతాలు, రోడ్లు నీట మునుగుతున్నాయి. దీనిపై మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ?
 జవాబు : వర్షాకాలంలో భారీ వరదలు వచ్చిన ప్రతిసారి నగరంలో చిన్నచౌకు, రవీంద్రనగర్, గౌస్‌నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. దీనిపై అధికారులతో ప్రణాళికలు తయారుచేసి నీట మునగకుండా చర్యలు తీసుకుంటాం.
 
 ప్రశ్న : నగరంలో కొన్ని రహదారులు మాత్రమే విస్తరణ చెందాయి. మిగతా రోడ్లలో విస్తరణ పనులు పూర్తి కాలేదు. దీని వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులపై మీరేమంటారు ?
 జవాబు : బ్రాహ్మణవీధి, కృష్ణా సర్కిల్, దేవునికడప, క్రిస్టియన్ లైన్ తదితర ప్రాంతాల్లో విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రోడ్ల విస్తరణపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. అందరినీ ఒప్పించి రోడ్ల విస్తరణ చేయాల్సివుంది.
 
 ప్రశ్న : బుగ్గవంక సుందరీకరణ, పాతబస్టాండు బ్రిడ్జి ఇంకా పూర్తి కాకపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి ?
 జవాబు : బుగ్గవంక సుందరీకరణ, బ్రిడ్జిల నిర్మాణానికి వైఎస్ రూ.65కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం అధికార పార్టీలో ఉన్న వారు ఆ పనులను పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహించారు. వైఎస్ జగన్ సీఎం కాగానే ఆ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయిస్తాం.
 ప్రశ్న : ప్రత్యేక పాలనలో కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏం చేయబోతున్నారు ?
 జవాబు : ప్రభుత్వ అసమర్థత వల్ల నాలుగు సంవత్సరాలుగా కార్పొరేషన్‌లో ప్రత్యేక పాలన నడుస్తోంది. అవినీతి ఎక్కువగా జరిగిందనే ఆరోపణలున్నాయి. నూతన పాలకవర్గం వచ్చాక ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. గడువు లోపు సర్టిఫికెట్లు, ప్లాన్‌లు అందజేస్తాం.
 
 ప్రశ్న : సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా? వస్తే నగరానికి అదనంగాఏం చేస్తారు ?
 జవాబు : అవును. తప్పకుండా మా పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లను బాగు చేయడంతోపాటు కడపలో ఒక మంచి స్విమ్మింగ్‌పూల్ నిర్మించి పార్కులు అభివృద్ధి చేస్తాం. మున్సిపల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ప్రవేశపెట్టి కడపలో అత్యవసర సేవలు అందించేందుకు 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తాం. ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరుస్తాం. నత్తనడకన సాగుతున్న డంపింగ్ యార్డు ప్రక్షాళన పనులను వేగవంతం చేయిస్తాం.
 

మరిన్ని వార్తలు