కేసీఆర్.. కిలాడీ

21 Apr, 2014 04:06 IST|Sakshi
కేసీఆర్.. కిలాడీ

 భూపాలపల్లి/వర్ధన్నపేట రూరల్/గీసుకొండ/వరంగల్,న్యూస్‌లైన్ : కే అంటే కిలాడీ.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్‌డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా భూపాలపల్లి సరి హద్దులోని సీఆర్‌నగర్‌కు చేరుకున్నారు.



అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి, వర్ధన్నపేట మండలం ఇల్లంద, గీసుకొండ మండలం కోనాయమాకుల, హన్మకొండలో జరిగిన సభల్లో పొన్నాల మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రజలందరూ సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహిస్తే.. కేసీఆర్ ఇవేమీ పట్టనట్లు  ఫామ్‌హౌస్‌లో గడిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో పార్లమెంటులో ఒక్క ప్రశ్న వేయలేదని, కనీసం మాట్లాడలేదన్నారు.

 సీఎంను దళితుడిని చేస్తానని చెప్పి.. ఇప్పుడు అదే కుర్చీ కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ రాజ్యసభ సీటు అడిగితే.. వ్యంగ్యంగా ప్రశ్నించి ఆయనను అవమానించాడన్నారు. అతడి పిట్ట కథలు, తుపాకి రాముడి మాటలు నమ్మేవారెవరూ లేరన్నారు. కేసీఆర్ చేస్తాననేది తెలంగాణ పునర్నిర్మాణం కాదని, కుటుంబ నిర్మాణమని పొన్నాల విమర్శించారు.

తెలంగాణ పునర్నిర్మాణం అంటే కేసీఆర్ దృష్టిలో మళ్లీ తెలంగాణలో ధ్వంసమైన భూస్వామ్య, గడీల వ్యవస్థను పునర్నిర్మించడమేనని అన్నారు. పార్లమెంటులో తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెబుతున్నాడని, పూటకో మాట మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందన్నారు. ఒక్కో మహిళ రాణిరుద్రమ, సమ్మక్క, సారక్కలై దగాకోరు టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపీగా గెలిచినా కేసీఆర్ కనీసం అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణకు ముందుగా లేఖ ఇచ్చి తదుపరి అడ్డుకున్న టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం అనైతికమన్నారు. తెలంగాణను బీజేపీ అడ్డుకున్నప్పటికీ సోనియా కృతనిశ్చయంతోనే సాధ్యమైందన్నారు.

 టీఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది...

 టీఆర్‌ఎస్ పార్టీకి ఇక కాలం చెల్లిందని పొన్నాల అన్నారు. 2009లో మహాకూటమిలో ఉన్న టీఆర్‌ఎస్ 50 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాలు మాత్రమే దక్కాయన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ మంత్రులు నాలుగు నెలలపాటు మంత్రివర్గ సమావేశాలు, రెండు నెలల పాటు కార్యాలయాలకు వెళ్లకుండా, అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు.

ఫలితంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. స్వాతంత్య్రం, తెలంగాణ కోసం పోరాడింది, సాధించింది కాంగ్రెస్ పార్టీయేనని, తమ పార్టీని ప్రజలు ఎన్నటికీ మరువబోరన్నారు. కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన, అభివృద్ధి, ఆత్మ గౌరవం లభిస్తుందన్నారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు, ఫించన్‌ను రూ.వెయ్యి, రైతులకు పగటి పూట 12 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం, సింగరేణిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు.

 60 ఏళ్ల క్రితమే ఉద్యమం..

 60 ఏళ్ల క్రితమే తాను తెలంగాణ కోసం ఉద్యమం చేశానని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటూ రాష్ట్ర సాధన కోసం కృషి చేశానని  అన్నారు. తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి న్యాయం జరిగేలా కాంగ్రె స్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని వివరించారు.

 అనంతరం కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు సిరిసిల్ల రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడమే కాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రచార సభల్లో కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, పుల్లా భాస్కర్, గండ్ర భూపాల్‌రెడ్డి, గండ్ర సుధాకర్‌రెడ్డి, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, కొత్త హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 పొన్నాలకు ఘనంగా సన్మానం..

 హన్మకొండకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. భారీ పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు, కార్యకర్తలు పోటీపడి సన్మానించారు.

మరిన్ని వార్తలు