గిరిజన యోధుడు..

3 Apr, 2014 01:03 IST|Sakshi
గిరిజన యోధుడు..

ఆదర్శం: (కొమురం భీం): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల్ని రక్షించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. గోండు గూడెం వాసులతో కలిసి గె రిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.   ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనులకు స్వయం పాలన కోసం నిజాం పాలనపై యుద్ధభేరి మోగించాడు.
 
 హైదరాబాద్, సాక్షి: దేశంలో బ్రిటిష్ పాలన రాకముందే గిరిజన సామ్రాజ్యం(క్రీ.శ 1240 - 1749) ఉండేది. ఆ గోండ్వానా (గోండు) రాజ్యాన్ని ఆ తరువాత మరాఠీలు హస్తగతం చేసుకున్నారు. సిపాయిల తిరుబాటు (1857) కంటే ముందే బ్రిటిష్ పాలకులపై గోండులు తిరుబాటు చేశారు. 1836 నుంచి 1860 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఘన చరిత్ర ఆదీవాసీలది. అప్పటి గోండ్వానాలో అంతర్భాగంగా ఉన్న ఉత్తర తెలంగాణ నిజాం నిరంకుశ పాలన చవిచూసిన రోజులవి.  ఇలాంటి పరిస్థితుల్లో 1931- 40 మధ్యకాలంలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలపై తిరుబాటు బావుటాను యువ గోండు ధీరుడు కొమురంభీం ఎగురవేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనుల స్వయం పాలన కోసం యుద్ధభేరి మోగించాడు.
 
 ఆదిలాబాద్ జిల్లా కెరిమరి మండలం సంకేపల్లిగూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాబు దంపతులకు 1900లో కొమురం భీం పుట్టాడు. అటవీ సిబ్బంది దాడిలో తండ్రి కొమురం చిన్నూ మరణించడంతో తల్లితో కలిసి భీం మకాం సుర్ధాపూర్‌కు మారింది. భీం సాగు చేసే భూమిని నిజాం జాగీర్‌దార్ సిద్ధిఖ్ ఆక్రమించాడు. గోండులతో వెట్టిచాకిరీ చేయించాడు. బెదిరింపులకు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. గిరిజనులు అడవుల్లో పశువుల్ని మేతకు తీసుకువెళ్లినా, వంటచెరకు ఇంటికి తెచ్చినా ‘బంబ్‌రాం, దూపపెట్టి’ పేర్లతో నిజాం ప్రభుత్వం శిస్తు విధించింది. ఇదేమిటని ప్రశ్నించి పాపానికి జోడేఘాట్ పరిసరాల్లో ఇళ్లు, పంటల్ని ధ్వంసం చేశారు. దీంతో కొమురం భీం నిజాం పాలనపై ‘తుడుం’ మోగించాడు. సిద్ధిఖ్‌ను హతమార్చి అస్సాం వెళ్లి ఐదేళ్ల పాటు కూలి పనిచేస్తూ తల దాచుకున్నాడు. అక్కడే రాత్రి వేళ అక్షరాలను వంటబట్టించుకుని తిరిగొచ్చాడు.
 
 ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. జోడేఘాట్, బాబే ఝరీ, పట్నాపూర్, చల్‌బరిడి, శివగూడ, టెకెన్నవాడ, భీమన్‌గొంది, కల్లేగావ్, నర్సాపూర్, అంకుశాపూర్, లైన్ పటల్, శోశగూడ వంటి గోండు గూడెంల వాసులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నిజాం సైన్యం ప్రతిదాడులు చేసి కొమురంకు కుడి, ఎడమ భుజాలుగా ఉండే కొమురం సూరు, లచ్చు పటేల్‌ను బంధించింది. పలువురు ఆదివాసీలను జైళ్లల్లో పెట్టింది. అయినా కొమురం భీం వెరవలేదు. దాంతో నిజాం ఒక మెట్టు దిగి గిరిజనుల భూములకు పట్టాలిస్తామన్నాడు. అడవిపై గిరిపుత్రులకు సర్వహక్కులు కావాలన్న భీం డిమాండ్‌ను నిజాం తోసిపుచ్చాడు. నిజాం సైన్యం నిఘా మరింత పెంచింది. కొరియర్‌గా వ్యవహరించిన కుర్ధు పటేల్ ఇచ్చిన సమాచారంతో భీం రహస్య స్థావరాలను నిజాం సైన్యం తెలుసుకుని అర్ధరాత్రి వేళ జోడేఘాట్ గుట్టల్ని చుట్టుముట్టింది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీరమరణం పొందాడు.

మరిన్ని వార్తలు