మహిళానేతలు ‘వెండి’కొండలు!

15 Apr, 2014 02:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళా రాజకీయవేత్తలు వెండిపై మనసుపడుతున్నారు! ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళామణులు ప్రకటించిన ఆస్తుల చిట్టానే ఇందుకు నిదర్శనం. కాంగ్రె స్, బీజేపీల అగ్రనేతలు సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ వంటి ప్రముఖులు సహా ఇతర అభ్యర్థులెవరి వద్ద చూసినా వెండి ధగధగలే. సోనియా వద్ద 88 కిలోల వెండి ఉంది. దీని మొత్తం విలువ రూ. 39.16 లక్షలు. ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద తన వద్ద కిలోన్నర వెండి ఉన్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు చంద్రేష్ కుమారికి 30కిలోల వెండి సామగ్రి ఉంది. ఇక సుష్మా స్వరాజ్ దగ్గర వెండి నిల్వలు ఐదున్నర కిలోలకు పెరిగాయి.

గత ఎన్నికల్లో(2009) ఆమె తన వద్ద కేవలం 400గ్రాముల వెండి ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూతురు సుప్రియ కూడా తన వద్ద రూ. 4.3లక్షల విలువైన వెండి ఉన్నట్లు అఫిడవిట్ సమర్పించారు. దేశవ్యాప్తంగా పోటీలో ఉన్న చాలా మంది పురుష అభ్యర్థులు కూడా తమ భార్యల పేరు మీద భారీగా వెండి ఉన్నట్లు ప్రకటించడం విశేషం. కారణమేంటా అని కొందరు విశ్లేషకులు ఈ విషయంపై దృష్టి సారిస్తే ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం వెండి రేటు రూ. 43 వేలుగా ఉంది. గత ఐదేళ్లలోనే ధర రెట్టింపైంది. పైగా బంగారం కంటే వేగంగా పైపైకి దూసుకుపోతోంది. ఆభరణాల మెరుపులకు తోడు పెట్టుబడి కూడా కలిసొస్తుండటంతో నేతలంతా ఎక్కువగా వెండినే పోగేసుకుంటున్నారు!
 

మరిన్ని వార్తలు