ఇది జగన్ ప్రభంజనం

24 Apr, 2014 01:51 IST|Sakshi
చిలకలూరిపేటలో వైఎస్సార్ జనభేరికి హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌

ఎక్కడికెళ్లినా పోటెత్తుతున్న జనసంద్రాలు

సాక్షి, గుంటూరు, ఒంగోలు, కర్నూలు:  వినుకొండ, సంతమాగులూరు, చిలకలూరిపేట... ఒక చోట కాదు. ఒక జిల్లా అని లేదు. ఎక్కడ చూసినా జనసంద్రమే. భగభగ మండుతున్న ఎండల్లో సైతం వెల్లువలా పోటెత్తుతున్న జనాభిమానమే. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఊరి నుంచి మరో ఊరికి రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. దారి పొడవునా ఎదురుచూస్తున్న జన సందోహానికి నమస్కరిస్తూ... వారి కోరిక మేరకు వాహనం దిగి పలకరిస్తూ... వారి సమస్యలు వింటూ... ఓదారుస్తూ ముందుకు సాగుతున్నారు. అయినా సరే... మరో ఊరు చేరేసరికి నిప్పులు చెరుగుతున్న ఎండల్లో సైతం వేల మంది ఎదురుచూస్తూనే ఉన్నారు.
 
 ఆయన చెప్పే ప్రతి మాటకీ స్పందిస్తున్నారు. ప్రత్యర్థుల కుయత్నాలపై పిడికిళ్లు బిగిస్తున్నారు, రాజన్న రాజ్యానికి చెయ్యెత్తి జైకొడుతున్నారు. ఇదంతా పూర్తయి మరో ఊరు చేరేసరికి... అక్కడా పోటెత్తుతున్న జన సంద్రమే. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రచారం చేస్తున్న ఆయన సోదరి షర్మిల, దివంగత వైఎస్సార్ సతీమణి, విశాఖ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ సభలకూ జనం వెల్లువెత్తుతున్నారు. పోనీ వాళ్లనెవరైనా తీసుకొస్తున్నారా? రమ్మని పిలుస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. జననేతను చూడటానికి, అభిమానం చూపించటానికి స్వచ్ఛందంగా బయటికొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనేమీ తొలిసారి జనం ముందుకు వస్తున్న నాయకుడు కాదు. నాలుగేళ్లుగా ఓదార్పు యాత్రతో పాటు వివిధ కా ర్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెనూ పలకరించిన నేతే.

రాజమండ్రిలో వైఎస్సార్ జనభేరికి హాజరైన జనవాహిని. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ       

కర్నూలు జిల్లా ఆత్మకూరులో వైఎస్సార్ జనభేరికి హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. ప్రజలనుద్దేశించి    ప్రసంగిస్తున్న షర్మిల

 
అయినా సరే! తమ ఇంట్లో మనిషి కోసం తరలి వస్తున్నట్టుగా, తమ సొంత సోదరుడినో, బిడ్డనో చూడటానికి వస్తున్నట్టుగా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదంతా చూస్తున్న రాజకీయ నిపుణులు... ఇది 1978 నాటి ఇందిర ప్రభంజనాన్ని, 1983, 1994 నాటి ఎన్టీఆర్ సునామీని గుర్తుకు తెస్తోందంటున్నారు. ‘‘ఇవేవో వారానికోసారో, పది రోజులకోసారో నిర్వహిస్తున్న సభలు కావు. వైఎస్ కుటుంబీకులు ముగ్గురూ సగటున రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది సభలు నిర్వహిస్తున్నారు. ఇక రోడ్‌షోలకు లెక్కేలేదు. జనం రోడ్‌షోలకు భారీగా తరలి వస్తూనే... సభలకైతే వెల్లువెత్తుతున్నారు. ఇది రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నికల్లో కనిపించిన ఏ ప్రభంజనానికీ తీసిపోదనే చెప్పాలి. ఈ సారి సీమాంధ్రలో జగన్ గాలి మామూలుగా ఉండదు’’ అని వారు వివరిస్తున్నారు.
 
బుధవారమే కాదు. రెండ్రోజులుగా గుంటూరు జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ జగన్ సభలకు వచ్చేసరికి అంతటి ఎండలు కూడా వెలవెల పోతున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సైతం వృద్ధులు, మహిళలు జగన్‌కోసం భారీ ఎత్తున నిరీక్షించారు. యువకులైతే మిద్దెలు, మేడలు, సెల్ టవర్లు ఎక్కి జగనన్నకు జేజేలు పలికారు. 42 డిగ్రీల ఎండలో కూడా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి... జననేతపై పూలవర్షం కురిపించారు. మంగళవారం రాత్రి బస చేసిన బాలాజీ ఎస్టేట్స్ నుంచి జగన్ జనభేరి ప్రచార రథ ం ఉదయం 11 గంటలకు వినుకొండకు బయలుదేరింది. అప్పటికే వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై స్వచ్చందంగా అక్కడికి చేరుకున్నారు.
 
అక్కడి నుంచి వారంతా జగన్‌తో పాటు కదులుతూ... కొందరు వెనుక పరుగులు పెడుతూ... వినుకొండ బహిరంగసభకు చేరుకున్నారు. దార్లో పలు గ్రామాల ప్రజలు ఆయనకు అడుగడుగునా స్వాగతం పలికారు. అందుకే... నాలుగు కిలోమీటర్ల దూరానికి చేరుకోవడానికి జగన్‌కు 3 గంటలకు పైగా పట్టింది. అంత ఎండలో సైతం  ప్రజల ఉత్సాహానికి, తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలకు జననేత కరిగిపోయారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు వినుకొండలో మండుటెండలోనే జగన్ ప్రసంగం కొనసాగింది. గంట సేపు జగన్ మాట్లాడినా... ప్రసంగం పొడవునా కేరింతలు, హర్షధ్వానాలు తప్ప ఒక్కరు కూడా సభా ప్రాంగణాన్ని విడిచి వెళ్లలేదంటే... ఈ సారి ఎన్నికల్లో కనిపించబోయే జగన్ ప్రభంజనానికిదే సంకేతమంటున్నారు విశ్లేషకులు. ‘‘మరో 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ జీవితాలు మారుతాయి’’ అని జగన్ చెప్పినప్పుడు వినిపించిన హర్షాతిరేకాలు... రాష్ట్రంలో ఫ్యాన్ గాలిని ముందే చూపిస్తున్నాయంటున్నారు వారు. సంతమాగులూరులో సైతం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మండుటెండను లెక్క చేయకుండా జగన్ రాక కోసం వేలసంఖ్యలో అభిమానులు రోడ్లపైనే ఎదురుచూశారు. వారిలో కార్యకర్తలే కాదు. చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. జగన్ ప్రసంగం వింటూ నిలుచుండి పోయారు. ‘‘రాజశేఖర రెడ్డి మా జీవితాలను బాగు చేశారు. ఆయన రుణం ఎలాగూ తీర్చుకోలేకపోయాం. ఆయన వారసుడిగా వచ్చిన జగన్ కోసం కాసేపు ఎండను భరించలేమా?’’ అని వారిలో వారు మాట్లాడుకోవడం కనిపించింది. రాత్రి చిలకలూరి పేటలోనూ ఇదే పరిస్థితి. సంతమాగులూరు నుంచి అక్కడి వరకూ కూడా జనమే జనం.
 
ఈ ఒక్కరోజే కాదు. మంగళవారం కొల్లిపర నుంచి ప్రారంభమైన ఎన్నికల జనభేరిలోనూ మండుటెండ ను లెక్కచేయని ప్రజలు వేలసంఖ్యలో రోడ్ల వెంట జగన్ కోసం బారులు తీరారు. తెనాలి నుంచి దుగ్గిరాల, నంబూరు మీదుగా కాజ, మంగళగిరి వరకు సుమారు 35 కిలోమీటర్ల దూరం యువకులు మండుటెండలోనే ఆయన ప్రచార రథాన్ని అనుసరిస్తూ జగన్‌కు జయజయధ్వానాలు పలికారు. తరవాత ఒంగోలులోనూ అదే సీను. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నిర్వహించిన సభలో రోడ్లపై స్థలం లేనంతగా జనం కిక్కిరిసిపోయారు. ఇసుకేస్తే రాలని జనంతో రోడ్లన్నీ నిండిపోయాయి.

10 కిలోమీటర్ల దూరంలోని పోకూరు నుంచి సైకిల్‌పై వచ్చిన సుదర్శన్‌ను ‘ఇంత ఎండలో ఎందుకు వచ్చార’ని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించటంతో... ‘‘జగనన్న అంటే ప్రాణం. వైఎస్సార్ పథకాల ద్వారా నేను బాగుపడ్డా. ఆయన చనిపోయాక జగనన్నలో ఆయన్ను చూసుకుంటున్నా. అందుకే రోడ్లన్నీ జనంతో నిండిపోయినా ఎలాగోలా వచ్చా. బిల్డింగ్ ఎక్కి ఆయన్ను చూశా. ప్రసంగం విన్నా. ఆయనకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకోసారి ప్రయత్నిస్తా’’ అని జవాబిచ్చాడు. ఆయన అభిమానం అలాంటిది మరి. ఆ ఒక్క సభ వద్దే దాదాపు 50 వేల మంది వేచి చూశారంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది.
 
ఆఖరికి జనాభిమానం మధ్య అందరినీ పలకరిస్తూ... కరచాలనాలు చేస్తూ... వారి సమస్యలు వింటూ... అవ్వా! మీ కష్టాలు తీరుస్తా... అని భరోసా ఇస్తూ జగన్ ముందుకు వెళ్లేసరికి... తెనాలిలో సమయం మించిపోయింది. రాత్రి 10 గంటలు దాటితే ఎన్నికల ప్రచారం చేయకూడదన్న ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రసంగించడానికి కుదరదు. అయినా సరే... జగన్‌ను చూడటానికంటూ కొన్ని వేల మంది అలాగే నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఆయన వచ్చేదాకా ఒక్కరూ కదల్లేదు. వారిని చూసి మాట్లాడాలని అనిపించినా... ఆ అభిమానానికి చేతులు జోడించి, శిరసు వంచి నమస్కరిస్తూ మౌనంగానే ముందుకు కదిలారు జగన్.
 
షర్మిల, విజయమ్మ సభల్లోనూ అదే తీరు...
కర్నూలు జిల్లాలో రాజన్న బిడ్డ షర్మిలకూ, తూర్పుగోదావరిలో వై.ఎస్.విజయమ్మకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. అనపర్తి, రాజమండ్రిలలో విజయమ్మ రోడ్ షోలు, సభలకు జనం పోటెత్తారు. మధ్యాహ్నం ఎండల్లోనూ భారీగా తరలివచ్చారు. షర్మిల ప్రచారంలో భాగంగా పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు కర్నూలుకు చేరుకున్న ఆమెకు కల్లూరులో ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ వస్తోందని తెలిసి కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ ఆమె హావభావాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుని మురిసిపోయారు. నందికొట్కూరులో షర్మిల కార్యక్రమం లేకపోయినా ఆమె అటువైపుగా వెళ్తుండటం తెలిసి జనం భారీగా తరలివచ్చారు.
 
కాన్వాయ్‌ని అడ్డుకుని ప్రసంగించాలని కోరడంతో.. వారి కోరికను అంగీకరించిన షర్మిల కాసేపు మాట్లాడారు. అక్కడి నుండి ఆత్మకూరుకు చేరుకున్నారు. మార్గమధ్యలో పల్లె జనం రోడ్ల మీదకు వచ్చి బారులు తీరారు. ఆమెతో కరచాలనానికి పోటీపడ్డారు. పూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. ఆత్మకూరులో భారీ జన సందోహం మధ్య ఆమె రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేస్తూ ప్రసంగించారు. వెలుగోడైతే జన సంద్రమే. కార్యక్రమం లేకపోయినా షర్మిల ప్రసంగించారు. అనంతరం నంద్యాలకు వెళ్తూ పల్లె ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.

మరిన్ని వార్తలు