ఆఖరి మోఖా

26 Apr, 2014 03:24 IST|Sakshi

 సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో.. తొలి ఎమ్మెల్యే.. ఎంపీ పదవి కోసం అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా పట్టణాలు.. పల్లెల్లో పర్యటిస్తున్నారు. పోటాపోటీ ప్రచారాలతో పల్లెలు హోరెత్తుతున్నాయి. ప్రచార గడువు ఇంకొన్ని గంటలే మిగిలి ఉండడంతో ఆఖరి మోఖా(చివరి ప్రయత్నం)గా అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు.
 కొన్ని రోజులక్రితం వరకు వినూత్న ప్రచారాలతో పట్టణాల్లో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు ఇప్పుడు పల్లెబాట పట్టారు.
 
 విస్తృతంగా పర్యటిస్తూ.. ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పగలు బహిరంగ సభలు.. రాత్రి తెరచాటు ప్రచారాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలైతే.. తమను గెలిపిస్తే నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు, అపరిష్కృత సమస్యలను  పరిష్కరిస్తామని మరోసారి ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మాత్రం నియోజకవర్గాల్లో సమస్యలు.. పడకేసిన అభివృద్ధి.. ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. సిట్టింగ్‌ల మాటలు వింటున్న ఓటర్లు గడిచిన ఐదేళ్లు ఏం చేశారని మనసులోనే ప్రశ్నించుకుంటున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఇస్తున్న అసాధ్యమైన హామీలు చూసి ఔరా.. అంటున్నారు.
 
 అంతుపట్టని ఓటరు నాడీ
 ఇప్పటికే జిల్లాలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ... కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ... ఇలా అధినేతలందరూ వచ్చి ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపుకోసం ఓట్లు అభ్యర్థించారు. అగ్రనేతల పర్యటనల అనంతర ం.. ఓటర్లను ఆకర్షించాల్సిన బాధ్యతంతా బరిలో ఉన్న అభ్యర్థులపైనే పడింది. దీంతో వారు అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. పదిహేను రోజుల నుంచి పట్టణాలు.. మండలాల్లో విస్తృతంగా పర్యటించిన వారికి గ్రామాల్లో ఓటరు నాడీ అంతుపట్టకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. పోలింగ్‌కు అతి తక్కువ సమయం ఉండడంతో ఎలాగైనా ఓటర్లను ఆకర్షించుకునేందుకు పాట్లు పడుతున్నారు.
 
 తాయిలాలు
 జిల్లాలో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఓటర్లను మళ్లీ నమ్మించి.. ఓట్లు వేయించుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. అభ్యర్థులందరూ గెలుపోటములను నిర్ణయించే మహిళా సంఘాలు, కుల, విద్యార్థి సంఘాలు, ఉద్యోగుల ఓట్లు పొందేందుకు మద్యం.. డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులందరూ.. ‘ఎంత ఖర్చయినా పర్లేదు.. ఓట్లు రాబట్టే భారమంతా మీదే..’ అంటూ ద్వితీయశ్రేణి నాయకులకే అప్పగించారు. వారితోపాటు కార్యకర్తలకూ తాయిలాలు ప్రకటించారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలందరూ ఉత్సాహంగా పల్లెల్లో పర్యటిస్తూ.. ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మార్చడంలో నిమగ్నమయ్యారు. సాధారణంగా.. ప్రచార గడువు ముగిసిన తర్వాత పోలింగ్‌కు ముందు డబ్బు.. మద్యం పంపిణీ చే సేవారు. కానీ, ఈసారి ప్రచార గడువు ముగింపునకు ముందే  డబ్బు, మద్యం పంపిణీ చేస్తుండడం గమనార్హం.
 
 భారీగా పట్టుబడుతున్న నగదు
 ఎన్నికల సందర్భంగా జిల్లాలో శుక్రవారం వరకు రూ.2,73,98,607 నగదు, 22 కిలోల 489 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని, 10,103 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. 19 చెక్‌పోస్ట్‌ల ద్వారా 1,633 లీటర్ల ఐడీ లిక్కర్, 3,745 బీర్లు, 24 మినీబీర్లు, 625 పుల్‌విస్కీ, 615 హాఫ్ విస్కీ, 4,964 క్వాటర్ బాటిళ్లు, 4 ఆటోలు, 2 కార్లు, 20 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.
 

మరిన్ని వార్తలు