ఓటు కోసం చాటుమాటుగా.. ఓటు కోసం చాటుమాటుగా..

29 Mar, 2014 03:36 IST|Sakshi

ఆర్మూర్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మైకులు, ప్రచారాలతో హోరెత్తిన వార్డులు ప్రశాంతంగా మారాయి. అయితే ఈ ప్రశాంతత వెనుకే అసలు సిసలైన ప్రలోభపర్వం మొదలైంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్‌లో తెరచాటు ప్రచారం జోరందుకుంది. పురపోరుకు మిగిలిన ఈ ఒక్కరోజును అన్నిరకాలుగా సద్వినియోగం చేసుకునేందుకు చాలామంది అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలు ఎరజూపుతూ ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.

 వయసుల వారీగా
 తమ వార్డు/డివిజన్ పరిధిలో ఉన్న ఓటర్లను వయసుల వారీగా లెక్కగడుతూ.. ఎవరెవరికి ఏం కావాలో అందిస్తున్నారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు.. వారి ఓట్లు రాబట్టుకునేందుకు పలువురు అభ్యర్థులు కాలనీల్లో గుట్టుచప్పుడు కాకుండా చీరలను పంపిణీ చేస్తున్నారు. మరికొందరు ముక్కుపుడకలు, కుంకుమ భరిణెలు, వెండి ఉంగరాలు పంచిపెడుతూ ఓట్లు అడుగుతున్నారు. యువ ఓటర్ల కోసం తిన్నంత చికెన్, మటన్ బిర్యానీలు, తాగేవాళ్లకు తాగినంత మద్యం ఆఫర్లు ఇస్తున్నారు. మిగిలిన మధ్యవయస్కులైన ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లు అందించేస్తున్నారు. పలుచోట్ల మహిళా సంఘాలకు రూ. మూడు నుంచి రూ. ఐదు వేల మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు సమాచారం.

 సంఘాలూ తక్కువేం కాదు!
 పలుచోట్ల కుల సంఘాలు, యువజన సంఘాల సభ్యులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ వార్డు నుంచి పోటీకి నిలిచే అన్ని పార్టీల అభ్యర్థులను తమ వద్దకే పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. ఁమా కులం ఓట్లు గిన్ని ఉన్నయి.. మా సంఘ సభ్యులు గిందరున్నరు.. ఎంత ఇస్తవో చెప్పు..* అంటూ వారి నుంచి అందినంతా పుచ్చుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏదో ఓక విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కీలకమైన ఈ రెండు రోజుల పాటు వారిని తనవైపే తిప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆర్మూర్‌లోని ఐదో వార్డులో ఒక అభ్యర్థి ఇప్పటికే తనను గెలిపిస్తే ఏడాది పాటు డిష్ కనెక్షన్ ఫ్రీ అని ప్రకటించాడు. యువజన సంఘాల సభ్యులు సైతం అభ్యర్థుల వద్ద అందినకాడికి పుచ్చుకుంటున్నారు.

 అందినకాడికి లాగుదాం..
 కౌన్సిలర్ అభ్యర్థులు ఐదేళ్లకు ఒకసారి మన వద్దకు వస్తారు. వారి వద్ద నుంచి అందినకాడికి గుంజడానికి ఇదే మంచి అవకాశం. అనుకుంటూ పలువురు ఓటర్లు అన్ని పార్టీల నాయకుల వద్ద ఎంతో కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఎవరు ఎంత ఇచ్చినా అందరి వద్దా తీసుకొని మనకు నచ్చిన వ్యక్తులకే ఓటు వేసుకుందామనే తీరులో చాలామంది ఓటర్లు వ్యవహరిస్తున్నారు.

 నిబంధనలకు నీళ్లు..
 ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును అమ్ముకోవద్దు. విలువైన ఓటు కోసం ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా  క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం లేకుండా పోతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రజారంజకంగా పాలించాల్సిన అభ్యర్థులు నిబంధనలకు నీళ్లు వదిలి.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరోవైపు చాలామంది ఓటర్లు సైతం అభ్యర్థులను పిలిపించుకొని మరీ తమకు కావాల్సిన మొత్తాన్ని తీసుకుంటూ ఓటును అమ్ముకుంటున్నారు.

మరిన్ని వార్తలు