అఖరి విడత పోలింగ్ నేడే

12 May, 2014 02:10 IST|Sakshi
అఖరి విడత పోలింగ్ నేడే

3 రాష్ట్రాల్లోని 41 స్థానాల్లో ఓటింగ్
బరిలో 606 మంది అభ్యర్థులు
అందరి చూపు వారణాసి స్థానంపైనే..

 
 న్యూఢిల్లీ/వారణాసి: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరిదైన తొమ్మిదో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 18 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 17 సీట్లు, బీహార్‌లో 6 సీట్లలో ఓటింగ్ జరగనుంది. మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 9 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిదో దశ పోలింగ్‌తో సుమారు 35 రోజులపాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు మినహా మొత్తంమీద గత ఎనిమిది దశల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ ఎనిమిది దశల్లో సగటున 66 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు 16న జరగనుంది.

వారణాసిలో త్రిముఖ పోరు

తొమ్మిదో దశ పోలింగ్‌లో యావత్ దేశం దృష్టి వారణాసిపైనే ఉంది. హిందువుల ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన వారణాసి నుంచి బరిలోకి దిగడం ద్వారా యూపీలో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ స్థానంలో పోటీకి దిగగా ఆయనతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్నారు. అయితే స్థానికేతరులైన వీరిద్దరిపై కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత అజయ్ రాయ్‌ను బరిలోకి దింపడంతో వారణాసిలో త్రిముఖ పోటీ నెలకొంది. దీనికితోడు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. మొత్తంమీద ఈ స్థానంలో 20 మంది స్వతంత్రులు సహా 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హిందువుల ఓట్లపై బీజేపీ గంపెడాశలు పెట్టుకున్న ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో సుమారు 3 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మైనారిటీల ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు వారణాసిలో పోరు ప్రతిష్టాత్మకం కావడంతో పోలింగ్ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ 45 వేల మంది భద్రతా సిబ్బందిని వారణాసిలో మోహరించింది.

బీజేపీ కార్యాలయంలో పోలీసుల సోదాలు

వారణాసిలోని బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో యూపీ పోలీసులు, ఎన్నికల అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారంపై నిషేధం ఉన్నా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీగా ప్రచార సామగ్రిని వారణాసిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలించారన్న సమాచారంతో సోదాలు చేసి కరపత్రాలు, టీ-షర్ట్‌లు, బ్యాడ్జీలు తదితర ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సామగ్రిని ప్రచారం కోసం వినియోగించట్లేదని బీజేపీ పేర్కొనడంతో కేసు మూసేశారు.
 బరిలోని ప్రముఖులు వీరే: చివరి దశ బరిలో నిలిచిన ప్రముఖుల్లో నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన జగదాంబికాపాల్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ కుమార్, బెంగాల్ నుంచి తృణమూల్ నేతలు దినేశ్ త్రివేదీ, సౌగతా రాయ్, బీహార్ నుంచి దర్శకనిర్మాత ప్రకాశ్ ఝా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు