ఓటర్లకు నాయకుల 'నగదు బదిలీ'

17 Apr, 2014 13:52 IST|Sakshi
ఓటర్లకు నాయకుల 'నగదు బదిలీ'

ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి అభ్యర్థులు దొంగదారులు వెతుక్కుంటున్నారు. ఏ మార్గంలో డబ్బు తరలించినా ఎన్నికల అధికారులు పట్టేసుకుంటున్నారు. రహస్యంగా పంపుదామనుకుంటున్నా ప్రత్యర్థి పార్టీలకు విషయం తెలిసిపోయి ఉప్పందించడంతో పోలీసులు, అధికారులు, మీడియా వచ్చి పట్టుకుంటున్నారు. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. పోటీ చేసే అభ్యర్థులు దీనికి కూడా పరిష్కారాలు కనుగొంటున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టి.. తర్వాత ఉపసంహరించుకున్న 'ప్రత్యక్ష ప్రయోజన బదిలీ'.. అదే నగదు బదిలీ పథకాన్ని ఇందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు!!

చాలామంది ఓటర్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం పుణ్యమాని దాదాపు అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాటు.. ఆ వివరాలను గ్యాస్ డీలర్లకు ఇచ్చారు. దాంతో గ్యాస్ డీలర్ల వద్ద వాళ్ల పరిధిలో ఉన్న వినియోగదారులందరి బ్యాంకు ఖాతాల వివరాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్లి, వారివద్ద నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు.

అభ్యర్థులు తమ అనుచరుల్లో కొంతమందిని ఇందుకోసం పురమాయిస్తున్నారు. ఒక్కొక్కరికి లక్ష, రెండు లక్షల వంతున వారి ఖాతాల్లో డిపాజిట్ చేసి.. ఆయా ఖాతాల నుంచి ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేయిస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓటర్లకు కూడా బ్యాంకు ఖాతాలు ఉండటంతో వీరి పని మరింత సులభం అవుతోంది. డీలర్ల నుంచి కాకుండా నేరుగా ఆయా వాడల్లోని పెద్దల వద్దకు వెళ్లి వారినుంచే వివరాలు తీసుకుని తాము ఇవ్వదలచుకున్న మొత్తం అలా బదిలీ చేసేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం కాస్తా నాయకులకు ఇలా పంట పండిస్తోంది!!

మరిన్ని వార్తలు