ఒక్క సీటు.. వంద కోట్లు!!

27 Mar, 2014 10:48 IST|Sakshi
ఒక్క సీటు.. వంద కోట్లు!!

లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు మన రాష్ట్రంలో ఓ నాయకుడు పెడతానంటున్న ఖర్చు ఎంతో తెలుసా?.. అక్షరాలా వంద కోట్ల రూపాయలు!! మరొకాయన అంత కాకపోయినా, కనీసం 35 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారట! ఇవన్నీ ఎవరో ఆషామాషీగా అన్న మాటలు కావు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ వద్ద సదరు అభ్యర్థులే స్వయంగా చెప్పిన విషయాలు. వీటిని బ్రహ్మ ఓ సందర్భంలో చెప్పారు. ఎన్నికల సమయంలో తరలిస్తున్న డబ్బును పోలీసు తనిఖీలలో పట్టుకుంటున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 80 కోట్లు పట్టుకుంటే, అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు 50 కోట్లు పట్టుకున్నారట. హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్రా ప్రాంతంలో కేవలం ఒక్క సంఘటనలోనే రెండు కోట్ల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం దొరికాయంటే ఈ 50 కోట్లు ఓ లెక్కా? ఇక తాజాగా గురువారం నాడు విజయవాడ సమీపంలోని దొనబండ చెక్ పోస్టు వద్ద ఏకంగా వంద కిలోల బంగారం దొరికింది. ఈ లెక్కను ఇంకా బ్రహ్మగారు కలపలేదు. అది కూడా కలిపితే ఇంకెంత అవుతుందో మరి!!

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఖర్చు సగటున 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటోంది. జమిలి ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ లలో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయని బ్రహ్మ తెలిపారు.

ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నేత.. అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.70 లక్షలకు పెంచినంత మాత్రాన ఏం సరిపోతుందని, ఆ కాస్త సొమ్ము ఎన్నికలకు చాలనే చాలదని, కనీసం పరిమితిని రూ.3 కోట్లు చేసి ఉంటే బాగుండేదన్నారని బ్రహ్మ చెప్పారు. గెలుపు కోసం తాను రూ.35 కోట్ల వరకూ ఖర్చు చేస్తానని సదరు అభ్యర్థే చెప్పారట. ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎంత కీలకంగా మారిందో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలని బ్రహ్మ అన్నారు.

>
మరిన్ని వార్తలు