చేపల చెరువులో మద్యం డంప్

25 Apr, 2014 09:54 IST|Sakshi
చేపల చెరువులో మద్యం డంప్

చేపలు ఉండాల్సిన చెరువుల్లో మందుబాటిళ్లు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు.. లెక్కలేనన్ని మందు బాటిళ్లు ఆ చెరువులో ఉన్నాయి. చేపలు పట్టుకుందామని వెళ్లిన మత్స్యకారులకు ఉన్నట్టుండి ఆ సీసాలు కనపడటంతో వారు అవాక్కయ్యారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. ఈ చిత్రం విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామ సమీపంలో జరిగింది. ఆలమండ సమీపంలోని విజయసాగరం చెరువులో భారీ మద్యం డంపును జాలర్ల సహకారంతో ఎక్సైజు అధికారులు ఛేదించారు. ఉదయం నుంచి అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో సీసాలు బయటపడ్డాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా అలమండ చెరువులో సుమారు 1580 మద్యం బాటిళ్లు లభించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికే ఈ మద్యం తెచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

వాస్తవానికి పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడకు భారీ మొత్తంలో మద్యం దిగుమతి అయినట్లు కొద్ది రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దాన్ని ఛేదించడానికి ప్రయత్నించినా అప్పట్లో ఎలాంటి ఆచూకీ లభించలేదు. తాజాగా దొరికిన మద్యం గతంలో తాము పట్టుకోవడానికి ప్రయత్నించిందేనని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మద్యం డంప్ కోసం మరిన్ని చెరువుల్లో గాలింపు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు