గూపుల గండం

19 Mar, 2014 00:38 IST|Sakshi
గూపుల గండం

 జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన
 అన్ని పార్టీల్లో అంతర్గత     వర్గ విభేదాలు
 ఒక వర్గం మద్దతు కోరితే.. మరో గ్రూపునకు కోపం..
 జెడ్పీటీసీగా గెలవడం కంటే     మద్దతు కూడగట్టడమే కష్టం

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించి జెడ్పీటీసీగా బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గ్రూపుల గుబులు పట్టుకుంది. జెడ్పీటీసీగా గెలుపొందడం ఒకెత్తయితే, జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఆ పార్టీ నుంచి గెలుపొందే మిగతా జెడ్పీటీసీల మద్దతు కూడగట్టడానికి పాట్లు పడాల్సి వస్తుంది.

 ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో తీవ్ర స్థాయిలో గ్రూపు విభేదాలున్న నేపథ్యంలో జెడ్పీటీసీలుగా గెలిచిన ఆయా నేతల వర్గీయుల మద్దతు పొందడం అంత సులభం కాదు. దీంతో ఈ పీఠంపై కన్నేసిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తీరా అసలు సమయంలో ఎవరు మద్దతిస్తారో..  ఎవరు హ్యాండిస్తారోనని మదన పడుతున్నారు.

 ప్రధాన పార్టీల్లో..
     రెండున్నరేళ్ల ఆలస్యంగా నిర్వహిస్తున్న జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల జాతర ఊపందుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈసారి చైర్మన్ స్థానం బీసీ మహిళకు కేటాయిచారు. కాగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో కీలకమైన ఈ జెడ్పీపై పార్టీ జెండాను ఎగురవేసేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కానీ ఈ ప్రధాన పార్టీల నాయకుల్లో నెలకొన్న గ్రూపు విభేదాలు ఆయా పార్టీల అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

     కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల్లో తీవ్ర స్థాయిలో గ్రూపు విభేదాలు ఉన్నాయి. ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు నేతలుండగా, కొన్ని చోట్ల ఈ విబేధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్నాయి.

ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల టిక్కెట్లను తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ఈ నేతలు తీవ్రస్థాయిలో పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఏ ఒక్కరిని నొప్పించకుండా ఇద్దరు నేతలున్న చోట్ల చెరిసగం, ముగ్గురున్న చోట మూడో వంతు చొప్పున జెడ్పీటీసీ టిక్కెట్ల పంపిణీ చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్ల టిక్కెట్ల పంపకాలు కూడా ఇలాగే జరిగాయి.

     టీఆర్‌ఎస్ పార్టీల్లో విభేదాలు నియోజకవర్గస్థాయిలో లేకపోయినా, జిల్లాలోని ముఖ్యనేతలు ఒకరంటే ఒకరికి పడదు. మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన నడిపెల్లి దివాకర్‌రావు ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో చాలా కాలంగా పనిచేస్తున్న నాయకులకు, కొత్తగా వచ్చిన వారికి ఏ మాత్రం పడటం లేదు.

     ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటేనే వారి అనుచరులుగా ఉంటూ గెలుపొందిన జెడ్పీటీసీల మద్దతు దక్కుతుంది. విభేదాలున్న నేతల్లో ఒకరు మద్దతిస్తే.. మరోనేత మద్దతు ప్రశ్నార్థకం కానుంది. ఈ అంశం తలకు మించిన భారం కానుంది.

 జెడ్పీటీసీలుగా గెలుపొందాక, చైర్మన్ ఎన్నిక ప్రక్రియలోనే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. చైర్మన్ స్థానానికి సరిపడా మెజారిటీని నిరూపించుకునేందుకు సర్వశక్తులు వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ పలుకుబడితో పాటు, మద్దతిచ్చే సభ్యులకు భారీగా ముట్టజెప్పాల్సి ఉంటుంది.
 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతలేదన్న రూ.కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ అంశం కలిసొచ్చినప్పటికీ చైర్మన్ పదవిని ఆశించాలంటే ఆయా పార్టీల్లో ముఖ్య నేతలు వెనుకాడాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు