లోక్‌సభ 4, అసెంబ్లీ 16 నామినేషన్ల తిరస్కరణ

22 Apr, 2014 02:41 IST|Sakshi

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శ్రీకాకుళం లోక్‌సభ, జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. లోక్‌సభ నియోజకవర్గానికి 15 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తిరస్కరించారు. అంతకుముందు తన సమావేశ మందిరంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మిగతా 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉంది.
 
 తిరస్కరించినవి ఇవీ..
   శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నామినేషన్ ఆమోదం పొందటంతో డమ్మీ అభ్యర్థి కింజరాపు విజయకుమారి నామినేషన్‌ను తిరస్కరించారు.  కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థి కిల్లి కృపారాణి నామినేషన్ సక్రమంగా ఉండటంతో డమ్మీ కిల్లి విక్రాంత్ నామినేషన్‌ను తిరస్కరించారు.  జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన అభ్యర్థి పైడి రాజారావు నామినేషన్ ఆమోదం పొందటంతో డమ్మీ అభ్యర్థి పైడి శ్రీలక్ష్మి నామినేషను తిరస్కరించారు.
 
   నామినేషన్ పత్రాలు పూర్తిగా పూరించకపోవటం, అఫిడవిట్‌లో కొన్నిచోట్ల నోటరీ సంతకాలు లేకపోవటంతో స్వతంత్ర అభ్యర్థి నాయుడుగారి రాజశేఖర్ నామినేషన్‌ను తిరస్క రించారు.   శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో టీడీపీ డమ్మీ అభ్యర్థి గుండ విశ్వనాథ్ నామినేషన్‌ను తిరస్కరిం చారు. నామినేషన్ పత్రంతోపాటు తగు ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోవడమే దీనికి కారణం.  ఎచ్చెర్ల నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో మూడింటిని తిరస్కరించారు. టీడీపీ తరఫున కిమిడి వెంకట రామమల్లిక్ వేసిన రెండు సెట్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున కిలారి వెంకట నారాయణమ్మ వేసిన నామినేషన్ తిరస్కరించారు. సకాలంలో బీ-ఫారాలు అందజేయకపోవటంతో వీరి నామినేషన్లను తిరస్కరించారు.
 
   ఆమదాలవలస నియోజకవర్గానికి దాఖలైన 36 నామినేషన్లలో రెండింటిని తిరస్కరించారు. టీడీపీ తరఫున నామినేషన్ వేసిన కూన ప్రమీల బి-ఫారం సమర్పించనందున, స్వతంత్ర అభ్యర్థి గెడ్డాపు రమణ నామినేషన్ పత్రంలో 10 మంది ప్రతిపాదకులు లేకపోవటంతో వాటిని తిరస్కరించారు.   రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన 12 నామినేషన్లలో ఒకదానిని తిరస్కరించారు. టీడీపీ తరఫున ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మా ప్రసాద్ వేసిన నామినేషన్‌లో 10 మంది ప్రతిపాదకులు లేకపోవడంతో తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
 
   నరసన్నపేట నియోజకవర్గానికి 10 నామినేషన్లు దాఖలు కాగా ఒకరి నామినేషన్‌ను తిరస్కరించారు. టీడీపీ డమ్మీ అభ్యర్థి బగ్గు సుగుణమ్మ నామినేషన్ పత్రాలు సంపూర్ణంగా లేని కారణంగా తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.  టెక్కలి నియోజవర్గానికి పది మంది నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్‌లను తిరస్కరించారు. టీడీపీ డమ్మీ అభ్యర్థి కింజరాపు విజయమాధవి, కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి కిల్లి మల్లన్న నామినేషన్లు వీటిలో ఉన్నాయి.  పలాస నియోజకవర్గంలో 15 మంది నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. ఎ, బి ఫారాలు, ప్రతిపాదకుల సంతకాలు లేని కారణంగా గౌతు విజయలక్ష్మి, వంక సుధల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి చెప్పారు.
 
   పాలకొండ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. అవసరమైన ధ్రువపత్రాలు, పేర్కొనాల్సిన సమాచారం లేకపోవడంతో నిమ్మక భాగ్యలక్ష్మి(కాంగ్రెస్), నిమ్మక పాండురంగ(టీడీపీ), పాలక సాంబయ్య(సీపీఎం)ల నామినేషన్లను తిరస్కరించారు.  ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 18 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. బి-ఫారం సమర్పించకపోవటం, పది మంది ప్రతిపాదకులు లేకపోవటంతో టీడీపీ తరఫున బెందాళం నీలోత్పల వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు.  పాతపట్నం నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు