నోట్ల ఎర.. మద్యం మాయ!

26 Apr, 2014 04:02 IST|Sakshi
నోట్ల ఎర.. మద్యం మాయ!

 ‘రానున్న ఎన్నికల్లో ఓడిపోతే కోల్పోయేది అధికారమే కాదు.. ఏకంగా పార్టీయే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.. అందుకే ఏం చేస్తారో తెలీదు. ఎంతకైనా తెగించండి.. డబ్బు వెదజల్లండి. మద్యం ఏరులై పారించండి.. ప్రతి ఒక్కరినీ మేనేజ్ చేయండి. ఎలాగైనా గెలుపు కావాలి. అంతే..’ ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు, కార్పొరేట్ లాబీకి చేసిన ఎన్నికల మంత్రోపదేశం.

దీంతో రంగంలోకి దిగిన కార్పొరేట్ మాయగాళ్లు జిల్లా టీడీపీని పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. డబ్బు మూటలు దించుతున్నారు. మద్యం బాటిళ్లను కుమ్మరిస్తున్నారు. సామాజిక వర్గాల ప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలకు నోట్ల ఎర వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది.

 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని దాదాపు తేలిపోవడంతో టీడీపీ పూర్తిగా బరి తెగిస్తోంది. ఎన్నికలకు మరెన్నో రోజులు లేని సమయంలో తన అసలు రూపాన్ని బయటపెడుతోంది. డివిజన్ల వారీ గా నియోజకవర్గాలను తనకు సన్నిహితులైన కార్పొరేట్ లాబీకి చంద్రబాబు దత్తత ఇచ్చేశారు. పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావుల ఆధీనంలోని కార్పొరేట్ లాబీ జిల్లా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుంది. క్షేత్ర స్థాయిలోకి దూసుకుపోతోంది. ‘మీరు ప్రచారం చేసుకోండి.

 అసలు విషయమంతా మేం చూసుకుంటాం’అని అభ్యర్థులకు తేల్చి చెప్పేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే డివిజన్లవారీగా బాధ్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టెక్కలి డివిజన్ బాధ్యతలను నామా నాగేశ్వరరావుకు చెందిన గ్రానైట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ యాజమాన్యంతో కలసి టీడీపీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత చేపట్టింది.

జిల్లా లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న ఆ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల పేరిట  డబ్బు మూటలు దించుతోంది. ఒడిశాలో ఎన్నికలు ముగియడంతో అక్కడ నుంచి ఆర్థిక వ్యవహారాలను ఆపరేట్ చేస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి నేతలతో చర్చలు చేపట్టింది. టీడీపీకి మద్దతిస్తే భారీ నజరానాలు ఇస్తామని ప్రకటించింది.

 కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలోనే ఈ చర్చలు సాగాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అచ్చెన్నను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపిక చేసుకున్న నేతలను డబ్బుతో కొనేయాలన్నది టీడీపీ కార్పొరేట్ లాబీ పన్నాగం. అదేవిధంగా పలాస నియోజకవర్గంలో టీడీపీని వ్యతిరేకిస్తున్న ఓ ప్రధాన సామాజికవర్గంతోపాటు మత్స్యకార గ్రామాలపై నోట్ల వల విసిరింది.

ఈ మేరకు ఇప్పటికే డబ్బు మూటలతో టీడీపీ ప్రతినిధులు మత్స్యకార గ్రామపెద్దలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై మద్యం వల కూడా విసిరారు. భారీ ఎత్తున మద్యం సీసాలను గ్రామాల్లోకి పంపి హల్ చల్ చేస్తున్నారు. కానీ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్రలోభాలకు ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

తమ గ్రామాల్లోకి వస్తే అంతు చూస్తామని మత్స్యకార పెద్దలు హెచ్చరించడంతో టీడీపీ ప్రతినిధులు తోకముడిచి జారుకున్నారు.శ్రీకాకుళం డివిజన్‌లో టీడీపీ అభ్యర్థుల తరపున డబ్బు పంపిణీ బాధ్యతను ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు సమాచారం. శ్రీకాకుళం పట్టణం, గార మండలాల్లో ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రాత్రివేళల్లో ప్రధాన సామాజిక వర్గాల పెద్దలను కలుస్తూ మంతనాలు సాగిస్తున్నారు.

100, 150 ఓట్లు ఉన్న చోటామోటా నేతలకు కూడా భారీగా ఎర వేస్తున్నారు. శ్రీకాకుళం గుజరాతీపేటలోని నాలుగు వార్డుల్లో కాస్తో కూస్తో పట్టున్న ఓ నేతకు భారీ మొత్తాన్నే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థికి సహకరించనని ఇటీవల తేల్చిచెప్పారు. దాంతో ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు కార్పొరేట్ లాబీ పెద్ద మొత్తాన్నే ఎరవేసింది.

గార మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో కూడా టీడీపీ నోట్ల కట్టలు దించుతోందని సమాచారం. ఆమదాలవలస నియోజకవర్గంలో గ్రామాలవారీగా టార్గెట్లు నిర్ణయించి నోట్ల కట్టలు దించుతున్నారు. ఇక నరసన్నపేట నియోజకవర్గం కోసం ఎంతైనా ఖర్చు చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నేతలను మేనేజ్ చేసేందుకు ఆయన భారీ ఆఫర్లే ఇస్తున్నారని తెలిసింది. తాను నేరుగా రంగంలోకి దిగకుండా కార్పొరేట్ లాబీ ప్రతినిధులను ఆ నేతల వద్దకు పంపుతున్నారు.

అధికారుల తీరుపై అనుమానాలు
 టీడీపీ కార్పొరేట్ లాబీ యథేచ్ఛగా నోట్ల పందేరానికి బరితెగించినా అధికార యంత్రాంగం కనీస స్థాయిలో స్పందించడం లేదు. టెక్కలిలో డబ్బు మూటలు దించారన్న విషయం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ ఆ పార్టీ నేతల వాహనాలనుగానీ, ఇళ్లనుగానీ పోలీసులు ఇంతవరకు తనిఖీ చేయనే లేదు. మత్స్యకార గ్రామాల్లో టీడీపీ ప్రతినిధులు డబ్బు మూటలతో తిరుగుతున్నా స్పందనే లేదు. అధికార యంత్రాంగం టీడీపీ పట్ల ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందన్నది సందేహాస్పదంగా మారింది.

మరిన్ని వార్తలు