మాగుంట నిర్వేదం

20 May, 2014 02:58 IST|Sakshi
మాగుంట నిర్వేదం

 సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌కు గుడ్‌బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది.

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం  అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది.
 
మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది.
 
 రాజ్యసభ పదవికి ప్రయత్నాలు..
 పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు.
 
 నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు