రాస్తే.. రోడ్డెక్కుతా!

25 Mar, 2014 00:17 IST|Sakshi
రాస్తే.. రోడ్డెక్కుతా!

 మీడియాపై టీజీ చిందులు
 వ్యతిరేకంగా వార్తలొస్తే ఊరుకోనని హెచ్చరిక
 కోర్టు మెట్లెక్కుతానని బెదిరింపు

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రోడ్డెక్కుతా.. వారి చిట్టా విప్పుతానంటూ తాజా మాజీ మంత్రి, కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టి.జి.వెంకటేష్ మీడియపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నగరంలోని తన హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియాపై చిందులేశారు.  ‘ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లపై ఎంతైనా రాసుకోండి కానీ నాపై అక్షరం పొరపాటున రాసినా అంతు చూస్తా’నని హెచ్చరించారు. ‘మీ పేపర్లలో, చానళ్లలో ఎవరి గురించైనా రాయండి, ప్రసారం చేసుకోండి నేను పట్టించుకోను.

నా ప్రతిష్ట దిగజార్చేలా నీచంగా చూపించడం, రాయడం చేస్తే ఊరుకోనని’ బెదిరింపు దోరణిలో మాట్లాడారు. అసత్య కథనాలను ప్రసారం చేసిన వారి చరిత్రను బయటపెడతానన్నారు. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కేందుకూ వెనుకాడబోనన్నారు. గత 35 ఏళ్లుగా కర్నూలును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని.. అలాంటిది పొరపాటున కూడా వ్యతిరేక వార్తలు వస్తే తగిన గుణపాఠం చెబుతానన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. నా గురించి మీకు తెలియదు.. నాలో మరో వ్యక్తిని చూడాలనుకోవద్దండిని హెచ్చరించారు.

తనకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించకపోతే చానల్స్ ప్రసారాలను నిలిపేస్తానన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి మీడియా ప్రతినిధులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టీజీకి చెందిన ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాతబస్తీవాసులు ఆయనపై మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మీడియా పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు