సతమతమవుతున్న కన్నబాబు!

4 Apr, 2014 12:53 IST|Sakshi
సతమతమవుతున్న కన్నబాబు!

పత్రికా విలేకరిగా కెరీర్ ప్రారంభించి ఎమ్మెల్యే గా మారిపోయిన కురసాల కన్నబాబు ఇప్పుడు చాలా డైలమాలో వున్నారు. గత ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పిఆర్పీ స్థాపించి సీటు ఇవ్వడం గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పిఆర్పీ తరపున బరిలో నిల్చి గెల్చారు.  అయితే ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలినం కావడంతో.. ప్రస్తుతం  కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా రాష్ట్ర విభజన కన్నబాబు రాజకీయ జీవితానికి ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇప్పుడా పార్టీకి మనుగడ లేకపోవడంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీలో ఉండాలో , ఏ పార్టీ నుండి పోటీ చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్కు మనుగడ లేకపోవడం, వైసిపిలో ఖాళీ లేకపోవడం, టిడిపి నుండి కాకినాడ రూరల్ సీటు ఆశించినా అవకాశం లేకపోవడంతో ఎటూ వెళ్లలేక కాంగ్రెస్ పార్టీలోనే ఉండలేక కన్నబాబు సతమతం అయిపోతున్నారు.

విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ దాదాపు ఉనికిని కోల్పోవడంతో కన్నబాబు ఆ పార్టీతో పాటు, తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చిరంజీవికి కూడా గుడ్బై చెప్పె యోచనలో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ లేకపోవడంతో ఇప్పుడు చిరంజీవిని కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యే గా ఉన్న కాంగ్రెస్ పార్టీనే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తన రాజకీయ భవిష్యత్ ను కార్యకర్తలే నిర్ణయిస్తారని స్వయంగా చెప్తున్నారు.

టిడిపిలో చేరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కన్నబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేశారట. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో.. సిట్టింగ్ స్థానం నుంచే టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని.. తాను గతంలో పని చేసిన పత్రిక యాజమాని ద్వారా ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అక్కడా ఆయనకు వ్యతిరేకత ఎదురైందని చెబుతున్నారు. కన్నబాబు రాకను కాకినాడ రూరల్ టిడిపి నాయకులు అడ్డుపుల్ల వేశారట.

అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కన్నబాబు చివరి ప్రయత్నంగా విశాఖ జిల్లా పెందుర్తి సీటు కోసం యత్నిస్తే అదీ వర్కవుట్ కాలేదట. దీంతో ఏం చేయాలో తోచని కన్నబాబు తల పట్టుకొని కూర్చున్నారని ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆలోచనలో పడ్డ కన్నబాబు.. తన కేడర్‌తో తరుచూ మీట్ అవుతున్నారట.

చెప్పుల పార్టీలో చేరితే లాభం లేదనీ.. కమలం కొంత బెటరని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ఒక వేళ ఇండిపెండెంట్‌గా కాకినాడ రూరల్ నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపైనా కన్నబాబు మంతనాలు చేస్తున్నారట. మరి ఈ మాజీ జర్నలిస్టు ప్రయత్నం వర్క్ అవట్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు