తిరుగు ‘పాట్లు’... తప్పుకో భయ్...!

11 Apr, 2014 05:39 IST|Sakshi
తిరుగు ‘పాట్లు’... తప్పుకో భయ్...!

 ‘రెబెల్స్’ను తప్పించేందుకు తంటాలు    
  దారికొస్తున్న  అభ్యర్థులు
  పార్టీ పదవులు, ఆర్థిక సాయం ఎరలు

 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సాధారణ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని పోటీ నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారడంతో బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారని భావించిన చోట అధికారిక అభ్యర్థులే స్వయంగా రంగంలోకి దిగారు. భవిష్యత్తులో గు ర్తింపు ఇస్తామంటూ పార్టీల అగ్రనేతలు బుజ్జగించే ప్ర యత్నం చేస్తున్నారు.

ఇన్నాళ్లూ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆర్థికంగా నష్టపోయామంటూ తిరుగుబాటు అభ్యర్థులు చేసిన వాదన కూడా కొన్ని చోట్ల పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారికి అధికారిక అభ్యర్థుల నుంచి కొంత మేర ఆర్థిక సహకారం అందించి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా పార్టీలు సూచిస్తున్నాయి. మరోవైపు టికెట్ దక్కిన వారు   వ్యక్తిగతంగా రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు.  ఇదే అదనుగా తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు  తప్పుకునేందుకు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు.

 బీజేపీ, టీడీపీ నేతల మంతనాలు
 పొత్తుల మూలంగా పోటీ అవకాశం దక్కని బీజేపీ, టీడీపీ నేతలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. కొల్లాపూర్‌లో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ శ్రీనివాస్‌రెడ్డి పత్రాలను స్క్రూటినీలో తిరస్కరించారు. ప్రధానంగా నారాయణపేట, మక్తల్‌లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న రతంగ్‌పాండు రెడ్డి, కొండయ్యలను పార్టీ నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో టీఆర్‌ఎస్ అధినేత స్వయంగా ఫోన్‌లో సంప్రదించి బుజ్జగించినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కూడా అసంతృప్తులను బరిలో నుంచి తప్పించేందుకు స్వయంగా మంతనాలు చేస్తున్నారు.  ఎన్నిక అత్యంత కీలకమైనందున సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో 32 మంది అభ్యర్థులు తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో చివరికి ఎందరుంటారనే ఉత్కంఠ నెలకొంది.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా