మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు... పెళ్లి దాచిన ప్రసాదు

10 Apr, 2014 11:11 IST|Sakshi
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు... పెళ్లి దాచిన ప్రసాదు


బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవివాహితుడు కారు. ఆయనకు నలభై అయిదేళ్ల క్రితమే పెళ్లైంది. అంతే కాదు. ఇన్నాళ్లూ ఆయన వివిధ ఎన్నికల అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలమ్ ను ఖాళీగా వదులుతూ వచ్చారు. బుధవారం వడోదరలో నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన తాను వివాహితుడని, తన భార్య పేరు యశోదా బెన్ అని చెప్పుకున్నారు.


దీంతో నరేంద్ర మోడీ రహస్యమయ వ్యక్తిగత జీవితం పై మరిన్ని ఊహాగానాల తేనెతుట్టెని కదిలించినట్టయింది. తాను పెళ్లి చేసుకున్నట్టు మోడీ మొట్టమొదటిసారి అంగీకరించారు. యశోదాబెన్ తో మోడీకి వివాహమైన విషయం గుజరాత్ లో బహిరంగ రహస్యం. మోడీ స్వగ్రామం వడ్ నగర్ కి పది కి.మీ దూరంలోని ఒక ఊళ్లో యశోదాబెన్ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక బిజెపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇన్నేళ్ల తరువాత మోడీ తనకు పెళ్లైన విషయాన్ని ఒప్పుకున్నారు. ఆమె ఆస్తిపాస్తుల విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పుకున్నారు.


కానీ మోడీ ఈ విషయాన్ని తన అఫిడవిట్లలో ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదు? 2012 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లోనూ దీని గురించి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తనకు పెళ్లైన విషయాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎన్నికల తరువాత తన వైవాహిక స్థాయి విషయంలో వివాదం తలెత్తకూడదనే ఇలా చేశారా? బిజెపి తరఫు నుంచి కూడా దీని గురించి ఎవరూ స్పష్టీకరణనివ్వడం లేదు. మోడీ తనకు పెళ్లైందా లేదా అన్న విషయాన్ని అఫిడవిట్ లో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోడీ మొదటిసారి ఈ వెల్లడి చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఇది వివాదమై, తాను ప్రధాని కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఇలా చేశారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


అయితే మోదీ అన్నగారైన దామోదర్ దాస్ మోడీ మాత్రం మోడీకి బాల్య వివాహం జరిగిందని, అప్పట్లో తమ కుటుంబంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదని, కుటుంబంలో ఎవరూ అప్పట్లో పెద్దగా చదువుకున్న వారు లేరని ఒక ప్రకటనలో తెలియచేశారు. తరువాత కాలంలో మోడీ పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఆరెస్సెస్ ప్రచారక్ కావాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన పూర్తిగా బ్రహ్మచర్య జీవనాన్నే పాటించారు.

మరిన్ని వార్తలు