ఓటు రమ్మంటోంది.. ఆకలి పొమ్మంటోంది..!

23 Mar, 2014 04:44 IST|Sakshi
ఓటు రమ్మంటోంది.. ఆకలి పొమ్మంటోంది..!

స్థానిక సంస్థల నామినేషన్ల ఘట్టం ముగిసింది.ఓట్ల వేట మొదలైంది. స్థానిక ఎన్నికలు  రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారారుు. ప్రతి ఓటు  కీలకంగా మారింది. దీంతో నామినేషన్లు వేసి బరిలో నిలిచే అభ్యర్థులందరూ వలస ఓటర్లపై దృష్టి సారించారు. వారిని రప్పిం చేందుకు డబ్బులు ఎరచూపుతున్నారు.

విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్త్నెయ్ నగరాల్లో ఉన్న వలస ఓటర్లను రప్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలింగ్ సమాయానికి వచ్చి ఓటు వేసేందుకు రానుపోను ప్రయాణ ఖర్చులతో పాటు ఆ మూడు రోజులు కూలి డబ్బులు ఇచ్చేందుకు సైతం ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.  
 
దీనికోసం ఉత్సాహవంతులైన యువ కులను నియమించారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకోవడం, మరో వైపు పరువుప్రతిష్ఠల సమస్య కావడంతో వలస ఓటర్లకోసం పరుగులు తీస్తున్నారు. కొందరు మాత్రం గెలుపుపైనే నమ్మకం లేదు. దీనికి తోడు వలస ఓటర్లను రప్పించేందుకు పెట్టుబడి తడిసిమోపెడవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా అక్కడ కూలిచేసి జీవిస్తున్న వారు ఇక్కడ అభ్యర్థులిచ్చే డబ్బులకు ఆశపడి రావాలా... ఆకలి తీర్చుకునేందుకు అక్కడే ఉండిపోవాలా అన్న సందిగ్దం లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఉగాది పండుగ కూడా కలిసి రావడంతో గ్రామాలకు వచ్చేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. నాయకులిచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోతాయని, ఉగాది పండుగ చేసుకుని తిరిగి వలస పోవచ్చన్న భావనలో ఉన్నారు. ఏదైనా వలస ఓటర్లకు ఎన్నికలు కలిసొచ్చినట్టే.
 - న్యూస్‌లైన్, జలుమూరు

మరిన్ని వార్తలు