మరో 24 గంటలే..!

11 May, 2014 02:30 IST|Sakshi
మరో 24 గంటలే..!

- రేపే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
- పది గంటల కల్లా ఫలితం
- నర్సీపట్నం, యలమంచిలిలో సందడి
 నర్సీపట్నం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముహూర్తం సమీపిస్తోంది. ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. సుమారు 45 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు పట్టణాల్లో చైర్మన్ పీఠాలను ఏ పార్టీవారు అధిష్టించనున్నారో తేలిపోనుంది. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు.

 సోమవారం ఈ ఓట్ల లెక్కింపునకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు పురపాలికల్లోనూ సందడి నెలకొంది. నర్సీపట్నంలో 27, యలమంచిలిలో 24 వార్డులున్నాయి. యలమంచిలిలో ఒకటి ఏకగ్రీవమైంది. రెండు పట్టణాల్లోనూ 50 వార్డుల్లో 75,265 మంది ఓటర్లకు 59,441 మంది ఓటేశారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ చోటుచేసుకుంది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వీటి ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కోప్ కాలేజి, యలమంచిలికి అనకాపల్లి ఏఎమ్‌ఏఎల్ కాలేజీలోనూ లెక్కిపు చేపడతారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. లెక్కింపునకు ఒక్కో మున్సిపాలిటీకి 30 మంది అధికారులతో పాటు మరో 30 మంది కిందస్థాయి సిబ్బందిని నియమించారు.

ఈవీఎంలతో పోలింగ్ కారణంగా ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుంటే మధ్యాహ్నం ఒంటి గంట కల్లా లెక్కింపు  ముగించి, పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసిన వివిధ పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థుల విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తూ, సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు

మరిన్ని వార్తలు