సర్వత్రా ఉత్కంఠ

12 May, 2014 03:35 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదలకు వేళయింది. నెలన్నరగా కొనసాగుతున్న నిరీక్షణ సోమవారం మధ్యాహ్నానికల్లా వీడిపోనుంది. మార్చి 30న జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల పరిధిలో 100 డివిజన్లు, 226 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలు నువ్వా... నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2,166 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. వీరిలో 326 మంది అదృష్టవంతులెవరనేది తెలిసిపోనుంది.
 
 కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఫలితాలు రెండు గంటల్లోనే తేలనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవు తుంది. గరిష్టంగా రెండు గంటల్లో అన్ని వార్డులు/డివి జన్ల ఫలితాలు తేలుతాయి.
 
 ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. చివరి నిమిషంలో లాటరీ తీసి ఏ ఈవీఎం ఎవరు లెక్కించాలనేది నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరిస్తారు. లెక్కింపునకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలు ఉండేలా చర్యలు చేపట్టారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదివారం సాయంత్రం వెల్లడించారు.
 
 మేయర్, చైర్మన్ ఎన్నికపై సందిగ్ధం
 వార్డులు, డివిజన్ల ఫలితాలు వెలువడ్డప్పటికీ పరోక్ష పద్ధతిలో జరిగే కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశాక గానీ ఎన్నిక జరిగే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే అయిన జూన్ 2వరకు ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేనందున ఆ తర్వాతే మేయర్, చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశముంది. అప్పటివరకు పీఠంపై గురిపెట్టిన వారు సొంతపార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులను చేజారకుండా క్యాంపులు నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితాలు వెలువడ్డ వెంటనే క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పదవి కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
 

మరిన్ని వార్తలు