రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్

17 May, 2014 00:52 IST|Sakshi
రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్

 సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాగంటి మురళీమోహన్ గెలుపొందారు. శుక్రవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆవరణలో జిల్లా పరిధిలోని రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి నియోజకవర్గాల కౌంటింగ్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు సెగ్మెంట్ల లెక్కింపును ఆ జిల్లా కేంద్రమైన ఏలూరులో చేపట్టారు. అన్ని సెగ్మెంట్లలో కూడా మురళీమోహన్‌కు మెజారిటీ లభించింది. మొత్తం నియోజకవర్గంలో 14,16,859 ఓట్లు ఉండగా, అందులో 11,50,445 పోలయ్యాయి. వీటిలో మురళీమోహన్‌కు 6,20,791 ఓట్లు పోలవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి 4,58,691 ఓట్లు పోలయ్యాయి.

మొత్తం 1,62,091 ఓట్ల మెజారిటీతో మురళీమోహన్ విజయం సాధించినట్టు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గంధం చంద్రుడు ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం ఆరు గంటల్లోపు కౌంటింగ్ పూర్తవ్వగా, సాంకేతిక కారణాల వల్ల నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కౌంటింగ్ రాత్రి తొమ్మిది దాటే వరకు కొనసాగింది. ఇక్కడ కౌంటింగ్ పూర్తయిన అనంతరం రాత్రి పది గంటల ప్రాంతంలో మురళీమోహన్ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు